రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల పంపిణీ చేసే వైఎస్సార్ పింఛను పంపిణీ ప్రక్రియ సర్వర్ మొరాయించడంతో జాప్యం జరుగుతోంది. పింఛన్ల పంపిణీకి ఇంటింటికి వెళ్తున్న వాలంటీర్లు.. సర్వర్ పని చేయకపోవడంతో అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సెప్టెంబర్ నెల పింఛన్ల పంపిణీ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. గతంలో ప్రతి నెల 1వ తేదీన ఉదయం ఏడు గంటల సమయానికే కృష్ణాజిల్లాలో 90 శాతం పైబడి పింఛన్లు పంపిణీ జరిగేది. ప్రస్తుతం సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో ఉదయం తొమ్మిది గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 35 శాతం కూడా పింఛన్ల పంపిణీ పూర్తి కాలేదని సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కరోనా పరిస్థితులు నెలకొన్న నాటి నుంచి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛను దారులకు వేలిముద్రలతో సంబంధం లేకుండా పంపిణీ చేసేవారు. కానీ ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛనుదారుల వేలిముద్రలు తీసుకుని, వేలిముద్రలు పడకపోతే కంటి ఐరిస్ తీసుకుని పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: సుధాకర్ కేసులో కుట్ర కోణం... విచారణకు మరింత సమయం : సీబీఐ