నిరర్ధక ఆస్తుల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకునే పనిలో ఆర్టీసీ పడింది. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన సంస్థకు కరోనా మరింత దెబ్బకొట్టింది. నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు కోలుకోలేని విధంగా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి సంస్థ ఆధీనంలోని స్థలాలను లీజుకు ఇచ్చేందుకు నడుం బిగించింది. తద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చని భావిస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆర్టీసీకి బస్టాండ్లు ఉన్నాయి. వీటి కింద చాలా స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి. కొన్ని ప్రధాన కూడళ్లలో ఉండడంతో వాటిని చమురు కంపెనీలకు పెట్రోలు బంకుల ఏర్పాటుకు అద్దె ప్రాతిపదికన ఇవ్వనున్నారు.
కృష్ణా రీజియన్‌లో మొత్తం 14 డిపోలు, 27 బస్టాండ్లు ఉన్నాయి. దాదాపు 69.22 ఎకరాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇందులో 17.48 ఎకరాలలో నిర్మాణాలు పోగా.. మిగిలిన 51.74 ఎకరాల వరకు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పటికే ఇతర రీజియన్లలో విజయవంతమైన లీజు ప్రయోగాన్ని కృష్ణా రీజియన్‌లోనూ చేపడుతున్నారు. ఇందుకుగాను వాణిజ్య పరంగా కీలకమైన ప్రాంతాలను ఆర్టీసీ అధికారులు ఎంపిక చేశారు. అక్కడ ప్రధాన కూడళ్లలో ఉన్న బస్టాండ్లలోని స్థలాలపై సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా తొలి విడతగా ఉయ్యూరు బస్టాండును ఎంపిక చేశారు. అక్కడ బస్టాండులోని ఖాళీ ప్రదేశాన్ని పెట్రోలు బంకు నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. చమురు కంపెనీలు బిడ్లు దాఖలు చేయగా, ఐవోసీఎల్ దక్కించుకుంది. ఇంకా ఒప్పందం కుదరాల్సి ఉంది.
దీనికి కొనసాగింపుగా జిల్లా వ్యాప్తంగా మరో మూడు బస్టాండ్లను ఎంపిక చేశారు. చల్లపల్లి, బంటుమిల్లి, నూజివీడు ప్రయాణ ప్రాంగణాల్లోని స్థలాలు గుర్తించారు. చమురు కంపెనీలు, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా ప్రతిపాదిత ప్రయాణ ప్రాంగణాలను పరిశీలించారు. వీటిల్లోని కొంత ఖాళీ స్థలాన్ని వాణిజ్య అవసరాలకు లీజుకు ఇచ్చేందుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఇది విజయవంతమైతే జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లోని స్థలాలను ఇలా అద్దెకు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల జలవివాదం: క్రియాశీలకం కానున్న కృష్ణాబోర్డు