Roads Damage in Gudivada: కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో నాలుగు విడతల నుంచి ఆయనే ఎమ్మెల్యే. విపక్షాలపై విమర్శలు చేయాలంటే బూతులతో విరుచుకుపడతారు. ఎంతలా అంటే.. అవి విన్న ఎవరైనా చెవులు మూసుకోక తప్పదు. సీఎంకు భజన చేయడానికి కూడా ఈ ఎమ్మెల్యే ముందుంటారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు కొడాలి నాని. ఇంత ఘన చరిత్ర ఉన్న మన ఎమ్మెల్యే నియోజకవర్గంలో.. అభివృద్ధి మాత్రం శూన్యం.
ఒక్కసారి ఇక్కడి రహదారులపై ప్రయాణిస్తే.. వాహనాలు షెడ్డుకు, మనుషులు ఆస్పత్రికి వెళ్లాల్సిందే. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారని గొప్పలు చెప్పుకునే నానికే తెలియాలి.. ఆ రోడ్లు అలా ఎందుకు ఉన్నాయో.! కొడాలి నాని.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఏదో చేస్తారని గెలిపిస్తున్న ప్రజలకు మాత్రం ప్రతిసారి రిక్త హస్తాలే చూపిస్తున్నారు.
పూర్తిగా ధ్వంసమైన రోడ్లు - స్వయాన అధికార పార్టీ ముఖ్య నాయకుల నియోజవర్గాల్లోనే
నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిస్తే.. నియోజకవర్గంలో అభివృద్ధి రాష్ట్రమంతా చెప్పుకునేలా ఉండాలి. కానీ ఈ నియోజకవర్గానికి మాత్రం కనీసం రోడ్లకే దిక్కులేదు. నోరెత్తితే పచ్చి బూతులతో విపక్షాల మీద విరుచుకుపడే కొడాలి నాని.. వాహనదారుల కష్టాలు మాత్రం పట్టించుకోవడం లేదు. బైపాస్ రోడ్డయితే.. భారీ గుంతలతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఈ రోడ్డుపై ప్రయాణమంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమేనని ప్రజలు వాపోతున్నారు.
గుడివాడ ఆటో నగర్‌లోని మరమ్మతుల కోసం నిత్యం వందలాది లారీలు, ఇతర వాహనాలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తాయి. రోడ్డంతా గుంతల వలయంగా మారడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ద్విచక్ర వాహనదారులైతే.. గుంతల్ని తప్పించుకునేందుకు పాములా మెలికలు తిరుగుతూ వెళ్లాల్సి వస్తుంది. పగటి సమయంలో బాగానే ఉన్నా.. రాత్రి వేళల్లో రోడ్డుపై వెళ్లాలంటే వణికిపోతున్నారు.
అడుగుకో గొయ్యి, గజానికో గుంత - అధ్వానంగా పలాస రహదారులు
ప్రాణాంతకంగా మారిన ఈ రోడ్డును వేయాలంటూ వివిధ రాజకీయం పార్టీలు ఆందోళనలు చేసినా.. ప్రభుత్వానికి చలనం లేదు. తమ అవస్థలు తీర్చేందుకు.. సీఎం జగన్ రోడ్ల మరమ్మతుల బటన్ నొక్కాలని వాహనదారులు కోరుతున్నారు. బంటుమిల్లి రోడ్డుకు ప్రవేశించే.. చివరి మలుపు వద్ద పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రోడ్డు పాడైపోయి.. కంకర అంతా పైకి వచ్చి భయంకరంగా మారింది.
రోడ్డంతా గుంతలమయంగా మారడంతో.. వాహనాలు వెళ్తుంటే.. దుమ్ము, ధూళీ పైకి లేచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుమ్ము వల్ల తమకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కావాలని నాలుగు సార్లు గెలిపిస్తే.. కొడాలి నాని తమకు తగిన బుద్ధి చెప్పారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెబుతున్నారు.
Roads in Nellore: చెరువులా..! నెల్లూరు రహదారులా..? రోడ్లపై మడుగులో కూర్చుని టీడీపీ నేతల నిరసన