కృష్ణాజిల్లా నందిగామలో విద్యుత్ శాఖ కార్యాలయంలో విజయవాడ రూరల్ డివిజన్ విద్యుత్ ఉద్యోగుల సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాలో వ్యవసాయ విద్యుత్ ఉచితంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ. 250 కోట్లు మంజూరు చేసిందని ఏపీసీపీడీసీఎల్ జయకుమార్ తెలిపారు. ఇందులో డీస్కింకు రూ.43 కోట్లు, ఏపీ ట్రాన్స్కో రూ. 207 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో సబ్ డివిజన్లో మైలవరం, రమణక్కపేట, గంపలగూడెంతోపాటు ఉయ్యూరులో 130 కే.వి సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
జిల్లాలో 342 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు ఉన్నాయని...వీటిలో 271 పరిధిలో పగటిపూటే ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. మరో 71 వ్యవసాయ విద్యుత్ కేంద్రాల పరిధిలో పగటిపూట వ్యవసాయ విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో ఐదు వేల విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు త్వరలో ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల బిగిస్తామని చెప్పారు. దీనివల్ల ఎంత విద్యుత్ వినియోగదారులు వాడుతున్నట్టు తెలుస్తుందని తెలిపారు. రైతులు వాడుకున్న విద్యుత్తుకు నగదు బదిలీ పథకం వారికి నిదులు ఇస్తామన్నారు. దీనిపై అపోహలు పడాల్సిన అవసరం లేదని చెప్పారు. లోవోల్టేజీ సమస్య ఉన్న చోట అదనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.