నవ్యాంధ్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఐకాస నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని రాజ్యాంగ వ్యవస్థల మీద ఎదురుదాడి చేస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు.
శాసన, న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థపై ఆధిపత్యం సాధించడానికి నిరంకుశంగా పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో భూముల ఆక్రమణ కోసమే రాజధానిని అక్కడకు తరలిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. రేపు అన్ని రెవెన్యూ కార్యాలయాల ఎదుట నిరసన తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు.
మైలవరంలో ..
అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలు చేశారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీలో యువకులు, తెదేపా నాయకులు భారీగా పాల్గొన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజధాని రైతుల పట్ల రాజధాని పట్ల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఇవీ చదవండి: