లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతపడినందున విద్యుత్ ఫిక్స్‌డ్ ఛార్జీలను ఏప్రిల్, మే, జూన్ నెలలకు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 97వేల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో.. నిర్ణీత గడువు లోగా దరఖాస్తు చేసున్న పరిశ్రమలు కేవలం 11వేలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలు మాత్రమే. పట్టణాల్లో వివిధ పాలకమండళ్లు, పారిశ్రామిక వాడల్లో రిజిస్టర్ అయిన వాళ్లు మాత్రమే అంతంత మాత్రంగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశ్రమల్లో ఎవరకీ దీనిపై అవగాహన లేకపోవటం... ఒకవేళ ఉన్నా ప్రభుత్వ నిబంధనలు కఠినతరంగా ఉండటంతో దరఖాస్తు చేసుకోలేదు.
కఠినతరంగా నిబంధనలు
నిబంధనల ప్రకారం ప్రభుత్వ పరంగా 70వరకూ అంశాలు పూర్తి చేయాల్సిరావడం.. వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా అనర్హత కిందకే వస్తుండటం వంటివి పారిశ్రామికవేత్తలకు గుదిబండగా మారాయి. స్థలాన్ని అద్దెకు తీసుకుని పరిశ్రమ నడిపేవారు చాలామంది ఉండటంతో వారు అర్హుల జాబితాలోకి రాలేకపోయారు. దరఖాస్తు చేసుకునే పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమ ఉన్న సర్వే నెంబర్ సహా ఇతరత్రా భౌగోళిక అంశాలన్నీ దరఖాస్తులో పూర్తి చేయాల్సి ఉన్నందున.. అవన్నీ వెల్లడించేందుకు ఇష్టపడని చాలామంది ప్రభుత్వ రాయితీకి నోచుకోవటం లేదు.
అప్పుడూ.. ఇప్పుడూ అదే పరిస్థితి
కృష్ణా జిల్లా పరిశ్రమ కేంద్రాల్లో వీటి దరఖాస్తుకు అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిక్స్‌డ్ ఛార్జీల రద్దు ప్రక్రియ అమలు చేసే బాధ్యతను పరిశ్రమల శాఖకు అప్పగించారు. ఇది అమలుకు నోచలేదు. దీంతోపాటు విద్యుత్ ఛార్జీలు కట్టమని విద్యుత్తు శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. పరిశ్రమల యజమానులకు నోటీసులు జారీ చేశారు. బిల్లులపై అపరాధ రుసుము కూడా వసూలు చేస్తున్నారని పారిశ్రమికవేత్తలు వాపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందని వారంటున్నారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవటం, ముడిసరకు ధరలు పెరగడం, అనుకూల మార్కెట్ లేకపోవటం వంటి కారణాలతో ఎక్కడా విద్యుత్ వినియోగం పెరిగిన దాఖలాలు లేవు. పరిశ్రమకు ఇచ్చే ప్రతి బిల్లులో ఫిక్స్ డ్ ఛార్జీలని వస్తుంది కాబట్టి నిబంధనలు సడలించి వాటిని రద్దు చేస్తే అందరికీ మేలు జరుగుతుందని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.
ఎం.ఎస్.ఎం.ఈలకు పూర్తి విద్యుత్ ఛార్జీలు మాఫీ చేస్తామని.. దీనివల్ల రూ. 188 కోట్లు రూపాయల లబ్ధిని చిన్న పరిశ్రమలకు అందిస్తామని ప్రభుత్వం ఏప్రిల్ చివర్లో ప్రకటించింది. ప్రకటనకే పరిమితమైన ఈ హామీ కఠిన నిబంధనల కారణంగా ఆచరణలో ఎక్కడా నోచుకోకపోవటంతో చిరు పరిశ్రమలు కరోనా కష్టాల నుంచి బయటపడడంలేదు.
ఇవీ చదవండి: