Pravasandhra man from Gannavaram missing: ''నా పేరు రత్న కుమారి. గవర్నమెంట్ టీచర్‌గా పనిచేసి పదవి విరమణ చేశాను. ఈరోజు ఉదయం గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు ఎస్సైలు మా ఇంటికొచ్చి మా అబ్బాయి (పొందూరి అంజన్)పై ఎఫ్‌ఐఆర్ బుక్కైంది అంటూ సుమారు రెండు గంటలపాటు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత మా బాబు వద్దనున్న రెండు ల్యాప్‌టాప్స్‌ను, మొబైల్స్ ఫోన్‌తోపాటు, పాస్‌పోర్ట్, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు తీసుకున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మా అబ్బాయిని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కానీ, ఇప్పటిదాకా అతను ఎక్కడ ఉన్నాడు..?, మా అబ్బాయిని ఏం చేశారు? అనే వివరాలను మాత్రం చెప్పటంలేదు. దాంతో మాకు చాలా భయం వేస్తోంది. దయచేసి మా అబ్బాయి ఆచూకీని చెప్పడంటూ గన్నవరం పోలీసులను ఎంత బతిమాలినా చెప్పటం లేదు. ఇప్పుడైన మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడో దయచేసి చెప్పండి.'' అంటూ కృష్ణా జిల్లా గన్నవరంలోని రాయ్‌నగర్‌కు చెందిన వృద్ద దంపతులు పోలీసులను వేడుకుంటున్నారు.
వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టాడని: వివరాల్లోకి వెళ్తే.. తన కొడుకు ఎక్కడున్నాడో తెలియజేయాలంటూ పోలీసులను వృద్ధ దంపతులు వేడుకున్న ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. స్థానిక రాయ్‌నగర్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు పొందూరి కోటిరత్నం అంజన్ అమెరికాలో పీజీ, ఉద్యోగం చేసి ఇటీవలే స్వదేశానికి చేరుకొని, ఇంటిలోనే ఖాళీగా ఉంటున్నాడు. నిన్న తెల్లవారుజామున సుమారు 6గంటల సమయంలో సామాజిక మాధ్యమాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా అసభ్యకర పోస్టింగ్‌లు పెడుతున్నాడని, తమకు ఫిర్యాదు అందిందని సుమారు పదిమంది పోలీసులు.. అంజన్ ఇంటిలోకి ప్రవేశించారు. తల్లి రత్నకుమారిని కుమారుడు కోటిరత్నం అంజన్‌ను ఇంటిలో ఉన్నాడా అంటూ వీఆర్వో రకీబ్, వీఆర్‌ఏ రామకృష్ణలతో కలిసి ఎస్సైలు రమేష్, శ్రీనివాస్ మరికొంతమంది పోలీసులు మఫ్టీలో ఇంటిలోకి చొచ్చుకెళ్లారు.
పోలీసుల సమాధానంతో తల్లిదండ్రులు కన్నీరు: ఈ క్రమంలో నిద్రిస్తున్న అంజన్‌ను లాక్కెళ్లిన పోలీసులు.. అతడి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, బ్యాంకు ఖాతా పుస్తకాలు, తల్లి సెల్ఫోన్‌ను లాక్కెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనీసం చెప్పకుండా కుమారుడ్ని తీసుకెళ్లడంపై తల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత గన్నవరం.. అక్కడి నుంచి ఉంగుటూరు స్టేషన్‌కు అంజన్‌ను తరలించిన పోలీసులు.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడి నుంచి ఎస్సై శ్రీనివాస్ తీసుకెళ్లినట్లు స్టేషన్ సిబ్బంది తెలిపారు. రాత్రి 11గంటలు దాటినా కుమారుడు ఎక్కడున్నాడో తెలియకపోవడంతో పాటు.. స్టేషన్‌కు వెళ్లినా తాము ఇప్పుడే విధులకు వచ్చామని పోలీసులు సమాధానం ఇవ్వడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇంటిపైకి పోలీసులు మఫ్టీలో రావడం ప్రజాస్వామ్యమా..?: ఈ సందర్భంగా అంజన్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మధ్నాహ్న సమయంలో ఓ కానిస్టేబుల్ ఇంటికి వచ్చి అంజన్ సెల్ఫోన్ ఛార్జర్ ఇవ్వాలని రెండు పర్యాయాలు వచ్చారని.. పోస్టు పెడితే దౌర్జన్యంగా ఇంటిపైకి పోలీసులు మఫ్టీలో రావడం ప్రజాస్వామ్యమా..? అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. తన కుమారుడికి ఏమి జరిగినా పోలీసులే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా.. వైసీపీ, టీడీపీ పోల్స్‌కు సంబంధించిన పోస్టును అంజన్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దానిపై గన్నవరం శ్రీనగర్‌కు చెందిన వి.నాగసూర్యప్రతాప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా.. సెక్షన్ 153(ఎ) కింద ఎఫ్‌ఐఆర్ నెం.161/2023గా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన ఎటువంటి వివరాలను వెల్లడించని పోలీసులపై..టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.
అంజన్ అక్రమ నిర్బంధాన్ని ఖండించిన చంద్రబాబు: గన్నవరం ఎన్‌ఆర్‌ఐ యువకుడు అంజన్ అక్రమ నిర్బంధాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. గన్నవరం యువకుడు అంజన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎంపై పోస్టు పెట్టాడని అంజన్‌ను నిన్న పోలీసులు తీసుకెళ్లాటం అన్యాయమన్నారు. తప్పుడు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి