అమరావతిలో రైతుల ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. అమరావతిని మరో నందిగ్రాంలా మార్చేందుకు వైకాపా ప్రభుత్వం పని చేస్తున్నట్టుగా ఉందంటూ ట్వీట్ చేశారు. రాజధాని రైతులు ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన చేస్తుంటే.. ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. రైతులు, మహిళలను భయపెట్టి నిరసనలకు దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ.. ట్విట్టర్లో ఓ లేఖను పోస్ట్ చేశారు. విశాఖ వాసులు కూడా పరిపాలన రాజధాని విషయంలో సంతృప్తిగా లేరని.. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై ప్రభుత్వానికి స్పష్టమైన ప్రణాళిక లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి అమరావతిలో స్థిరపడుతున్న ఉద్యోగులకు.. ఇప్పుడు విశాఖలో రాజధాని అంటే ఇబ్బంది అవుతుందని అన్నారు. ఆందోళనలు అణచివేస్తే.. అంతకంటే బలమైన ఉద్యమం జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని హెచ్చరించారు.
ఇవీ చదవండి: