నివర్ తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగనుంది. కృష్ణా జిల్లాలో జరిగే కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న అనంతరం అక్కడి నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. పెనమలూరు, గుడివాడ, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల మీదుగా పవన్ కల్యాణ్ ర్యాలీగా వెళ్లనున్నారు. పార్టీ నేతలు, రైతులు పాల్గొననున్నారు. దారి వెంట పలు చోట్ల రైతులను పరామర్శించడం సహా వారిని ఉద్దేశించి జనసేనాని ప్రసంగించనున్నారు.
నివర్ తుపాను, ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు హేతుబద్ధమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ మచిలీపట్నంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌కు పవన్ కల్యాణ్ వినతిపత్రం అందించనున్నారు. నివర్ తుపాను వల్ల రైతులు అపారంగా నష్టపోయారని.. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇస్తున్న పరిహారాన్ని పెంచాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే సానుకూల ప్రకటన చేయకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రజనీ 'రాజకీయ' ప్లాన్ కొనసాగుతుందా?