TDP leaders: పట్టాభి సతీమణి చందనను టీడీపీ నేతలు కేశినేని చిన్ని, ఆచంట సునీత పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చిన్ని సూచించారు. పార్టీతో పాటు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు. వంశీకి ఓటమి భయం పట్టుకుందని చిన్ని విమర్శించారు. గన్నవరం చేరుకుని నిరసన తెలిపారు. వంశీ ఓటమి భయంతోనే గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వంశీ, కొడాలి నాని విష పురుగులు. వంశీకి దమ్ముంటే టీడీపీ వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఈ సారి గన్నవరం, గుడివాడలో గెలిచేది టీడీపీ మాత్రమే. టీడీపీ గెలుపును ఎవరూ అపలేరు. - కేశినేని చిన్ని, టీడీపీ నేత
బాధితులపై కేసులు దుర్మార్గం... గుడివాడ తెదేపా నేత వెనిగండ్ల రాము గన్నవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. టీడీపీ శ్రేణులపై దాడులు చేసి, బాధితుల పైనే అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని వెనిగండ్ల రాము దుయ్యబట్టారు. అనాగరిక చర్యలు భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంటున్నా.. విధ్వంసం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టైన తెలుగుదేశం నేతల వివరాలు తెలుసుకునేందుకు గన్నవరం వచ్చానని వెనిగండ్ల తెలిపారు.
ప్రజా తిరుగుబాటు తప్పదు.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని ప్రజా తిరుగుబాటు తప్పదని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ వల్లభనేని వంశీ టీడీపీలో గెలిచి... వైసీపీలో రౌడీయిజం చేస్తున్నాడని, కొన్ని రోజుల్లో ఆ నియోజక వర్గంలో అతను అడ్రస్ లేకుండా పోతాడని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్ అండ చూసుకొని ఎగిసిపడుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. రాబోయే రోజుల్లో వారి పతనం ఖాయం. చంద్రబాబును అంతం చేయాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది. రానున్న ఎన్నికల్లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబుపై భౌతిక దాడులకు కుట్రజరుగుతోంది. రాష్ట్రంలో ఫ్యాక్షన్ మళ్లీ పెరిగిపోయింది. - గోరింట్ల బుచ్చయ్య, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, తెదేపా నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా బోనకల్- వత్సవాయి రోడ్డులో రాష్ట్ర సరిహద్దు వద్ద ఆందోళన చేశారు. అరాచక పాలన అంతం కావాలని, రౌడీ రాజ్యం నశించాలని నినాదాలు చేస్తూ మండల నాయకులు, కార్యకర్తలు గంట సేపు ఆందోళన నిర్వహించారు.
ఇవీ చదవండి :