Scams in the name of part-time job : ఖాళీ సమయంలో ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేస్తూ.. భారీగా సంపాదించుకోండి అని పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడడం ఇటీవల అధికమైంది. ముఖ్యంగా గృహిణులు, యువతులు వీరి బారిన పడి లక్షల్లో మోసపోతున్నారు. ఈ తరహా కేసులు నగరంలో ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఆకట్టుకునే ప్రకటనలు నిజమే అనుకుని పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు మోసగాళ్ల మాయలో చిక్కి విలవిల్లాడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పార్ట్ టైం జాబ్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకుంది.
అదనపు ఆదాయం వస్తుందని ఆశపడితే... టెక్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విజయవాడకు చెందిన యువతి మొబైల్‌కు ఓ రోజు సంక్షిప్త సందేశం వచ్చింది. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ అధిక డబ్బులు సంపాదించవచ్చు.. వివరాలకు సంప్రదించండి ఆ మెసేజ్ సారాంశం. ఫోన్ నంబర్ కూడా ఇవ్వడంతో నిజమే అని నమ్మిన ఆ యువతి.. వెంటనే ఫోన్ చేసింది. దీంతో అవతలి వ్యక్తులు యూట్యూబ్‌లో వీడియోలను లైక్ చేస్తే చాలని, అన్నింటికి లెక్కగట్టి డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో పాటు తాము ఇచ్చిన టాస్క్ పూర్తి చేస్తే.. పెద్ద మొత్తంలో సంపాదించవచ్చని ఆమెను బుట్టలో వేశారు. ఇంటి దగ్గరే ఉంటూ పనిచేసుకోవచ్చనే ఆశతో ఆ యువతి.. నిబంధనల అన్నింటికీ అంగీకరించి, తన బ్యాంకు ఖాతా వివరాలను అందించింది. ముందుగా మూడు వీడియోలు లైక్ చేసినందుకు ఆమె ఖాతాలో రూ.150 జమ చేసిన కేటుగాళ్లు.. మరో ఆరు వీడియోలను లైక్ చేశాక రూ.300 ఖాతాలో వేశారు. మొత్తానికి ఆమెకు నమ్మకం కుదిరేలా చేశారు. ప్రీపెయిడ్ టాస్కులు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని, ఆదాయం కూడా పెరుగుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. కానీ, ఆ మేరకు ముందుగా పెట్టుబడి పెట్టాలని.. దానికి ప్రతిఫలంగా లాభం వస్తుందని చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు. ముందుగా రూ.వెయ్యి చెల్లించడంతో తిరిగి రూ.1,600 ఆమెకు వచ్చాయి. ఇలా ఆమె విడతల వారీగా ఆమె పెద్ద మొత్తంలో రూ.19 లక్షలు పెట్టుబడి కింద పెట్టింది.
తిరిగి ఇవ్వాలంటే.. రూ.12.95 లక్షలు కట్టాల్సిందే.. లాభం వస్తుందని లెక్కలు చూపుతున్న కేటుగాళ్లు.. ఆ డబ్బును డ్రా చేసే అవకాశం ఇవ్వడం లేదు. దీనిపై ఆమె ప్రశ్నించడంతో.. ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే రూ.12,95,000 కట్టాలని చెప్పారు. లేనిపక్షంలో కట్టిన డబ్బు తిరిగి రాదని ఖరాకండిగా చెప్పేశారు. అప్పటికే రూ.19 లక్షలు చెల్లించి మోసపోవడం, ఇంకా చెల్లించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో నిరాకరించింది. తాను మోసపోయానని, డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు లేవని గ్రహించిన యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది.
ఇవీ చదవండి :