కరోనాపై పోరులో వివిధ స్థాయిలో సమన్వయం చేసుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యాలపై వేసవి సెలవుల మొదటి ప్రత్యేక బెంచ్ విచారణ జరుపుతుందని పేర్కొంటూ వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
నోడల్ అధికారుల వ్యవస్థపై అసంతృప్తి
ఆసుపత్రుల వద్ద బాధితులకు సహాయ సహకారాలు అందించే నోడల్ అధికారులు సక్రమంగా పనిచేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. విజయవాడలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రభుత్వం నియమించిన 56 మంది అధికారులకు పలుమార్లు ఫోన్ చేస్తే 22 మంది కనీసం ఫోన్ ఎత్తకపోవడంపై అసంతృప్తి చెందింది. మిగిలిన 34 మంది ఫోన్ తీసినా పడకలు లేవని చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి అధికారులపై విచారణ జరిపి ఏవిధమైన చర్యలు తీసుకున్నారో నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వీఐపీల పేరుతో కొన్ని పడకల్ని ఖాళీగా ఉంచడం సరికాదు
ఆసుత్రుల్లో పడకల కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా.. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి ఫోన్ చేస్తే పడకలు లేవని, సుమారు 150 మందికి పైగా వేచి ఉన్నారని సమాధానం చెప్పడం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఒక వేళ ఖాళీలు ఉంటే ఈ విధంగా ఎలా చెబుతారో అర్థం కావడం లేదు. కొవిడ్ ఆసుపత్రుల్లో వీఐపీల పేరుతో కొన్ని పడకల్ని ఖాళీగా ఉంచడం సరికాదు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అన్ని పడకలు బాధితులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి...’ అని ఆదేశించింది. పడకలు, ఐసీయూ, వెంటీలేటర్ల సంఖ్యను పెంచాలని చెప్పింది. పత్రికల కథనాల ప్రకారం అనంతపురం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో పలువురు మృతి చెందారనే విషయాన్ని అమికస్‌క్యూరీ, సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేసింది. ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు సంభవించలేదని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెబుతున్నారని తెలిపింది. ఆ మరణాలకు సంబంధించి తదుపరి విచారణ నాటికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరా పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ కేటాయింపు, రాష్ట్రంలో మరో 42 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు అనుమతిచ్చే విషయంలోనూ తదుపరి విచారణలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తరఫు సహాయ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) హరినాథ్‌ను ఆదేశించింది.
కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ తోట సురేశ్‌బాబు గతేడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడిలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల్ని అమలు చేయడం లేదని పేర్కొంటూ ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ (ఏపీసీఎల్‌ఏ) సంయుక్త కార్యదర్శి బి.మోహన్‌రావు కూడా హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పొత్తూరి సురేశ్‌కుమార్ వాదనలు వినిపించారు.
పడకలు లేవంటున్నారు
అధికారికంగానే పడకలు లేవని చెబుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పొత్తూరి సురేశ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వైద్య సేవలను ఇంకా పెంచాలని, నియోజకవర్గం స్థాయిలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. మరో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదిస్తూ.. ఆక్సిజన్ పడకలు లేక మరణాలు సంభవిస్తున్నాయని, గత 15 రోజుల్లో 15 మంది న్యాయవాదులు కన్నుమూశారని వివరించారు.
800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం
ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్, అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి, జీపీ సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఆసుపత్రుల అవసరాలకు ఆక్సిజన్ ఉత్పత్తికి మరో 5 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి లభ్యమవుతోందని అదనపు ఏజీ తెలిపారు. 638 కొవిడ్ ఆసుపత్రులు నోటిఫై చేశామన్నారు. 42 ప్లాంట్లు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాశామని, వచ్చే వారం రోజుల్లో రాష్ట్రానికి 800 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని భావిస్తున్నామని జీపీ సుమన్ తెలిపారు. సమీప రాష్ట్రాల నుంచి మరో 300 మెట్రిక్ టన్నులు కేటాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామన్నారు.
పత్రికలను నిలువరించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం
ఆక్సిజన్ కొరతతో అనంతపురంలో 8మంది మరణించారని పత్రికలు కథనాలు రాశాయని అదనపు ఏజీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆ మరణాలు ఆక్సిజన్ కొరతతో సంభవించినవి కాదన్నారు. ఇలాంటి వార్తలను ప్రచురించకుండా పత్రికలను నిలువరించాలని కోరారు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం.. బయట జరుగుతున్న లోపాలు కోర్టు దృష్టికి రావాల్సిందేనని పేర్కొంది. టీకా ప్రక్రియపై ధర్మాసనం ఆరా తీసింది. 18 ఏళ్లుపైబడిన 45 ఏళ్లలోపు వారికి ఎప్పటి నుంచి టీకా వేస్తారని ప్రశ్నించింది. 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు ఇచ్చాక.. 18పైబడిన వారి గురించి ఆలోచన చేస్తామని ఏజీ తెలిపారు.
హెల్ప్‌లైన్ నంబరు సక్రమంగా నిర్వహించలేకపోతే ప్రజలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వ్యవస్థను మెరుగుపరచాలి. ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు మధ్య సమన్వయం లోపం ఉన్నట్లు స్పష్టమవుతోంది. వారి మధ్య భారీ అంతరం ఉన్నట్లే. పనిచేయని నంబర్లు ఇవ్వడం అంటే అబద్ధం చెప్పడమే.... ఇలాగేనా రాష్ట్ర వ్యవహారాలు ఉండేది? కరోనా మూడో దశ వ్యాప్తి ప్రమాదం పొంచి ఉందంటున్నారు. చేతులు ముడుచుకొని కూర్చోవద్దు. కొవిడ్ పరీక్ష ఫలితాలకు 36 గంటలు ఎందుకు పడుతోంది? ఫలితాలను వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. లేబరేటరీల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు? టెస్టింగ్ ల్యాబ్‌లు, ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం పెంచేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి. కరోనా బారిన పడిన గర్భిణులకు మెటర్నటీ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసే విషయంలో కోర్టుకు వివరాలు సమర్పించాలి..
-ధర్మాసనం
క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదు: అమికస్‌క్యూరీ
కోర్టుకు సహాయకులుగా నియమితులైన అమికస్‌క్యూరీ, సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ ప్రభుత్వ చర్యల్లో చోటు చేసుకున్న లోపాల్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ‘సహాయకుడైన న్యాయవాది అశ్వనీకుమార్‌తో విజయవాడలోని ఆసుపత్రుల వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే పడకలు లేవని చెప్పి.. నిర్లక్ష్యంగా ఫోన్ కట్ చేశారు. కొందరు ఫోన్ తీయలేదు. ఒక నంబరు పంజాబ్‌కు వెళ్లింది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అధిక రుసుములను వసూలు చేస్తున్నాయి. కొందరు బాధితులను మూడు ఆక్సిజన్ సిలిండర్లతో రమ్మంటున్నాయి. సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలున్నాయి. లక్షణాలు కనిపిస్తే పడకలు ఇచ్చేలా ఆదేశించండి. పడకల విషయంలో ప్రభుత్వం సమర్పించిన మెమో, అఫిడవిట్‌లోని వివరాలకు చాలా వ్యత్యాసం ఉంది..’ అని వివరించారు.
ఇదీ చదవండి: