కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన కష్టాల్ని గుర్తుచేసుకుంటూ చెమ్మగిల్లిన కళ్లతో... స్వదేశంలో వ్యాక్సిన్ తయారు చేశామన్న ఆత్మవిశ్వాసం నిండిన హృదయంతో.. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం కొవిడ్ టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా సాయంతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో రూపొందించిన ‘కొవిషీల్డ్’, భారత్ బయోటెక్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ‘కొవాగ్జిన్’ టీకాలను అత్యవసర వినియోగం నిమిత్తం వాడుకలోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా 3,352 కేంద్రాల్లో దీన్ని ప్రారంభించారు. తొలి విడతగా 1,91,181 మంది పారిశుద్ధ్య కార్మికులు, కిందిస్థాయి ఆరోగ్య సిబ్బంది టీకాలు పొందారు. దిల్లీ, మరో పది రాష్ట్రాల్లో ఈ రెండు రకాల టీకాలను కూడా ఉపయోగించారు. మొత్తం 16,755 మంది సిబ్బంది సేవలు అందించారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. టీకా తీసుకున్న వారిలో ఎవరూ ఎక్కడా అనారోగ్యానికి గురికాలేదని స్పష్టంచేసింది. ఒక కేంద్రంలో రోజుకు వంద మంది లబ్ధిదారులకే పరిమితం చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
టీకాలు సురక్షితం
ఈ సందర్భంగా ప్రధాని మోదీ భావోద్వేగంగా ప్రసంగించారు. దేశ ప్రజలు నిస్వార్థంతో మహమ్మారిపై పోరాటం చేశారని ప్రశంసించారు. ఆధునిక తెలుగు యుగకర్త గురజాడ వెంకట అప్పారావు రచించిన ‘దేశభక్తి’ గేయాన్ని ఉటంకించారు. టీకాల తయారీలో పాల్గొన్న శాస్త్రవేత్తలందరికీ ప్రధాని తన ప్రసంగంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ టీకాలు సురక్షితమైనవని భరోసా ఇచ్చారు. ‘‘దేశ వాసులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రెండు వ్యాక్సిన్లు భారత్‌లో తయారైనవి. వీటి సమర్థత, సురక్షితపై శాస్త్రవేత్తలు, నిపుణులు తనిఖీలు చేశారు. అనంతరమే అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చారు. అందుకే వీటిపై జరుగుతున్న దుష్ప్రచారం, వదంతులు, తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. సాధారణంగా టీకాల రూపకల్పనకు ఏళ్లు పడుతుంది. కానీ మనం తక్కువ సమయంలోనే రూపొందించాం. విదేశాల్లోని టీకాలతో పోల్చినప్పుడు మనవి ఎంతో చౌక. వేయడం కూడా ఎంతో సులువు. మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని రూపొందించాం. ఈ రెండు టీకాలు మనకు నిర్ణయాత్మక విజయాన్ని తెచ్చి పెట్టాయి. ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
ఇది గర్వించే రోజు. సరయిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకున్నాం. నిత్యం పర్యవేక్షించాం. తొలి దశలోనే 3 కోట్ల మందికి టీకాలు ఇస్తున్నాం. రెండో దశలో 30 కోట్ల మందికి ఇస్తాం. మన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మానవత్వమే గీటురాయి. ప్రమాదం ముప్పు ఎక్కువగా ఉన్నవారికి, 50 ఏళ్లు పైబడ్డవారికి తొలుత టీకాలు ఇస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
దవాయీ భీ... కదాయీ భీ
టీకాలు వేసుకున్న తరువాత కూడా అప్రమత్తంగా ఉండాలని మోదీ కోరారు. ‘‘మాస్కులు ధరించడం మానకండి. భౌతిక దూరం పాటించండి. రెండు డోసులు తప్పకుండా వేసుకోండి. తొలిసారి టీకా వేసుకున్న 28 రోజులకు మళ్లీ వేసుకోవడాన్ని మరచిపోకండి. అందుకే మందులతో పాటు జాగ్రత్తలూ కూడా.. (దవాయీ భీ.. కదాయీ భీ) అన్నది నినాదం కావాలి’’ అని హితవు చెప్పారు.
కృతజ్ఞత తెలిపేందుకే ఆరోగ్య సిబ్బందికి తొలి టీకా
‘‘ఆరోగ్య సిబ్బంది సేవలను వెలకట్టలేం. సంక్షోభంలో చిక్కుకొని నిస్సహాయులుగా మిగిలినప్పుడు వారే ఆశాజ్యోతులుగా మిగిలారు. విధి నిర్వహణకే వారి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. చాలా రోజుల పాటు కుటుంబానికి దూరంగానే గడిపారు. కొందరయితే ఇళ్లకు తిరిగి వెళ్లనే లేదు. ఇతరుల ప్రాణాలను కాపాడడానికి వారు ప్రాణత్యాగం చేశారు. అందుకే తొలి టీకాను ఆరోగ్య సిబ్బందికి ఇవ్వడం ద్వారా దేశం వారి రుణాన్ని తీర్చుకుంటోంది. కృతజ్ఞత చాటుకుంటోంది’’ అని ఉద్వేగంగా చెప్పారు.
ఒంటరయ్యారంటూ కంట నీరు
మహమ్మారిపై పోరులో జనం ఇబ్బందులు, ఆరోగ్య సిబ్బంది త్యాగాలను గుర్తుచేసుకుంటూ ప్రధాని కన్నీరు పెట్టుకున్నారు. ‘‘ఎవరికైనా ఒంట్లో బాగులేకపోతే ఇంట్లో వారంతా వచ్చి సేవ చేస్తారు. కానీ కరోనా ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ వైరస్ సోకిన వారిని ఏకాంతంలో ఉంచాల్సి వచ్చింది. తమకూ వ్యాపిస్తుందన్న భయంతో మిగిలినవారూ సమీపంలోకి వెళ్లలేకపోయారు. తల్లులకు దూరంగా చిన్న పిల్లలు ఉండిపోయారు. విలపించడం తప్ప ఏమీ చేయలేకపోయారు. వృద్ధులను ఆసుపత్రుల్లో ఒంటరిగా వదిలి పిల్లలు నిస్సహాయులుగా మిగిలారు. మరణించిన వారు సంప్రదాయ అంత్యక్రియలకు నోచుకోలేకపోయారు. ఇవన్నీ గుర్తుకు వస్తే కళ్లు నీటితో నిండిపోతాయి. దుఃఖం కలుగుతుంది.’’
ప్రధాని నోట గురజాడ గేయం
కరోనాపై పోరులో దేశవాసులు స్వార్థం వీడి సేవలు చేశారంటూ గురజాడ గేయాన్ని ప్రస్తావించారు. దీని అర్థాన్ని కూడా వివరించారు.
‘‘సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్!
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్!’’
దీని అర్థాన్ని వివరిస్తూ ‘ఇతరులకు సేవ చేసేందుకు నిస్వార్థ భావం మనలో ఉండాలి. దేశమంటే మట్టి, రాళ్లు, రప్పలు, నీరు కాదు. దేశానికి అర్థం మన ప్రజలు. ఈ భావజాలం ఆధారంగానే దేశ ప్రజలు కరోనాపై జరిగిన పోరాటంలో పాల్గొన్నారు’ అని చెప్పారు.
దేశంలో తొలి టీకా మనీశ్ కుమార్‌కు
దిల్లీ: దిల్లీలోని ఎయిమ్స్‌లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి టీకాను పారిశుద్ధ్య కార్మికుడు మనీశ్ కుమార్ (34)కు కొవాగ్జిన్ టీకా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాత్రంతా బాగా నిద్రపోయా. ఉదయాన్నే ఆసుపత్రికి వచ్చా. తోటి ఉద్యోగులతో మాట్లాడా. వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలా మంది భయపడ్డారు. నేనే స్వయంగా వెళ్లి సిద్ధంగా ఉన్నానని చెప్పా. టీకా వల్ల ఎవరికీ ముప్పులేదని చెప్పడమే నా ఉద్దేశం’’ అని తెలిపారు.
దేశమంతటా పండగ వాతావరణం
టీకా ఆవిష్కరణ సందర్భంగా దేశంలోని ఆసుపత్రుల్లో పండగ వాతావరణం నెలకొంది. చాలా చోట్ల బెలూన్లు, పుష్పాలతో అలంకరించారు. కొన్ని చోట్ల ప్రార్థనలు జరిగాయి. మిఠాయిలు పంచుకున్నారు. టీకాల బాక్సులకు హారతులు ఇచ్చారు. కోల్‌కతాలో ఓ ప్రయివేటు ఆసపత్రికి చెందిన వైద్యురాలు బిపాషా సేఠ్‌కు తొలి టీకా ఇచ్చారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మెడికల్ వ్యాన్ డ్రైవర్ అశోక్ భాయ్‌కు తొలి టీకా ఇచ్చారు. గోవా వైద్య కళాశాల కార్మికుడు రంగనాథ్ భోజే తొలి డోసు పొందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌లు ఆయనకు గులాబీలు అందజేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లో అంబేడ్కర్ స్మారక వైద్య కళాశాల పారిశుద్ధ్య కార్మికురాలు తుల్సా తండికి తొలి టీకా ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య సిబ్బందిని పూలతో స్వాగతం పలికారు. ప్రజల్లో విశ్వాసం నింపడానికి టీకాలు తీసుకున్న ప్రముఖుల్లో దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పౌల్, సీరం ఇన్‌స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా, పశ్చిమ బెంగాల్ మంత్రి నిర్మల్ మజి తదితరులు ఉన్నారు.
ఏపీలో తొలి రోజు 19,108 మందికి టీకా
కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏపీలో శనివారం సజావుగా మొదలైంది. తొలిరోజు 19,108 మంది ఆరోగ్య సిబ్బంది టీకా తీసుకున్నారు. ఎంపిక చేసిన 332 ఆసుపత్రుల్లో 31,570 మందికి టీకా వేసేలా ఏర్పాట్లు చేపట్టారు. అయితే.. రాత్రి 8.30 గంటల వరకు 60.52% మంది టీకా తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. టీకా తీసుకున్న వారిలో ఎనిమిది మందికి స్వల్ప దుష్ప్రభావం (మైనర్ రియాక్షన్) వచ్చినట్లు పేర్కొంది.