ntr varsity vc on funds: విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిధుల మళ్లింపుపై దుమారం కొనసాగుతున్న వేళ.. దీని వెనుక జరిగిన పరిణామాలను ఉపకులపతి డాక్టర్ శ్యాంప్రసాద్ ఏపీఎన్జీఓ నాయకులతో పంచుకున్నారు. బలవంతంగా ఆ పని చేయించారని.. 50 ఏళ్లు సర్జన్‌గా పనిచేసిన తాను, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని అన్నారు. తీవ్ర ఆవేదనతో కూడిన వీసీ శ్యాంప్రసాద్ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
నెల రోజులుగా ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10గంటల వరకు ప్రభుత్వ పెద్దల దగ్గరే ఏడ్చాను. నిధుల మళ్లింపుపై నేనేం చెప్పడానికి వీల్లేకుండా.. నా చేతులు కట్టుకుని, తలదించుకుని వారి ఎదుట కూర్చునేలా చేశారు. నేనో దళితుడిననో, ఇంకేదో చెప్పి చేసే వ్యవహారం కాదిది. ఈ విషయంలో దేవుడు మంచి చేస్తాడనే అనుకుంటున్నాను. ‘వ్యవస్థ కోసం నిలబడాల్సిందే కానీ.. నన్ను కాళ్లు చేతులు కదలకుండా చేసి నిలబెట్టి ఇదా.. అదా.. ఏదో ఒకటి తేల్చుకోమంటే నేను ఏం చేయాలి. - ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ శ్యాంప్రసాద్
గత నెల నుంచి ప్రతిరోజూ గంటల తరబడి ప్రభుత్వ ముఖ్యుల వద్ద చేతులు కట్టుకుని, తలదించుకుని నిలబడ్డానంటూ.. డాక్టర్ శ్యాంప్రసాద్ వాపోయారు. చివరికి ముఖ్యమంత్రి జగన్ తనతో మాట్లాడారని.. 10 రోజుల్లో ఏదో ఒకటి చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.
400 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థకు బదిలీ చేసిన ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు.. పాలన, ఉద్యోగుల భద్రత, ఒప్పంద కార్మికుల జీతభత్యాలు, పింఛన్ల కోసం కొంత తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 175 కోట్లు వెనక్కి ఇచ్చి, మిగిలిన నిధులకు వడ్డీ చెల్లించాలని కోరారు. 2022 - 23 ఏడాదికి విశ్వవిద్యాలయ మనుగడకు 100 కోట్లు, పెన్షనర్ల రిజర్వ్ ఫండ్ కింద 25 కోట్లు, గ్రాట్యుటీకి 25 కోట్లు, ఉద్యోగుల సంక్షేమ నిధికి మరో రూ.25 కోట్లు ఇవ్వాలని కోరినట్లు.. వీసీ శ్యాంప్రసాద్, రిజిస్ట్రార్ శంకర్ తెలిపారు.
సంబంధిత కథనాలు: