No Water in Krishna Delta Andhraprades : కృష్ణాడెల్టాలో సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయి. సాగర్, కృష్ణా ఆయకట్టులోనూ కరువు ఏర్పడింది. సాగుకు విడతల వారీగానే విద్యుత్ సరఫరా అందుతుండం వల్ల రైతులను విద్యుత్ కోతలు వెంటాడుతోన్నాయి. ఖరీఫ్ సీజన్ కీలక సమయంలో వానలు కురవక రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు తీవ్రంగా ప్రభావితమవుతోంది. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ డెల్టా పరిధిలో సుమారు 60వేల ఎకరాల్లో వరి ఎండిపోతోంది. కొమ్మమూరు కాలువ కింద 2.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు 1.85 లక్షల ఎకరాల్లోనే వరి సాగైంది. ప్రధాన కాలువకు 2,950 క్యూసెక్కులు వదులుతుండగా దుగ్గిరాల లాకుల వద్ద 2,200 క్యూసెక్కులు వస్తోంది. కొమ్మమూరు కాలువకు ఇస్తున్న 1900 క్యూసెక్కుల నీరు చాలక.. పూండ్ల, పడమర బాపట్ల, పీటీ ఛానళ్ల పరిధిలో వేల ఎకరాల్లో పైరు నెర్రెలుబారింది.
కృష్ణానది లేని విశాఖలో.. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం
formers protest on water crisis : అన్నదాతలు కాలువల్లో నీటిని డీజిల్ ఇంజిన్లతో తోడిపోస్తున్నారు. ఎకరానికి 25 వేలు పెట్టుబడి పెట్టగా, ఇప్పుడు ఒక్కో తడికి ఇంజిన్ అద్దె, డీజిల్ కొనుగోలుకు 1200 ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో పొలం రెండు రోజులకే బెట్టబారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారబందీ విధానంలో నాలుగు రోజులు కొమ్మమూరు కాలువకు, మూడ్రోజులు నిజాంపట్నం, ఆరమండ, రేపల్లె ఛానళ్లకు నీరివ్వాలన్నది ప్రణాళిక ఉండగా.. అదీ అమలు కావడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతోన్నారు. వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టుపై ఆశలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని వారు నిరాశ చెందుతోన్నారు. హైలెవల్ కాలువ, బ్యాంక్ కెనాల్ కింద, పెదకాకాని, కొల్లూరు, రేపల్లె మండలాల్లో సమస్య తీవ్రంగా ఉందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగునీరు అందక ఎండుతున్న పంటలు.. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతుల అవస్థలు..
crops drying up due to lack of irrigation : నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని ఆయకట్టులో మాగాణి సాగు ఈసారి తగ్గింది. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసినా, అధిక శాతం భూమి బీడుగానే ఉంది. వర్షాల్లేక పత్తి, మిరప, ఇతర పంటలు బెట్టకొస్తున్నాయి. ఎండల ధాటికి ఉదయం 9 గంటలకే మొక్కలు వాలిపోతున్నాయి. సాగర్ ఆయకట్టు రైతులు బావులు, వాగుల నుంచి డీజిల్ ఇంజిన్ల ద్వారా నీరు తోడిపోస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో బోర్ల ద్వారా నీరిద్దామన్నా విద్యుత్తు కోతలు వెంటాడుతున్నాయి. రోజుకు మూణ్నాలుగు గంటలే విడతలవారీగా కరెంటు ఇస్తున్నారు. నకరికల్లు, రాజుపాలెం మండలాల్లో 4 వేల ఎకరాల్లో వరి పైరు దెబ్బతింటోంది. బొల్లాపల్లి, ఈపూరు రైతులు విద్యుత్తు కోతలపై వారం రోజులుగా సబ్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
కృష్ణా జలాలు తెలంగాణకు తాకట్టు.. ఎన్నికల కోసం రూ.1200కోట్లు తీసుకున్న సీఎం జగన్ : టీడీపీ
గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా నీటిని మళ్లించే అవకాశమున్నా, జగన్ సర్కారు తొలుత నిర్లక్ష్యం చేసిందని వాపోతున్నారు. ప్రస్తుతం పట్టిసీమ నుంచి 7,050 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తుంటే, బ్యారేజీకి 4,400 క్యూసెక్కులే చేరుతోందని మరో రైతు తెలిపారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 16.5 మీటర్లు ఉండగా.. 15 మీటర్లకు తగ్గితే ఎత్తిపోతల అసాధ్యమని.. ఈ నెలాఖరుతో పట్టిసీమ నిలిచిపోతే, ఇక పులిచింతల ప్రాజెక్టే దిక్కని అంటున్నారు. దీని సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 32 టీఎంసీల నీరుందని. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కృష్ణా డెల్టా, ముఖ్యంగా దివిసీమ రైతులు కోరుతున్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. సీఎం స్పందించడం లేదు: రైతుసంఘాలు