నివర్ తుపాను తాకిడికి గురైన వరిపంట పోలాల్లో.. వర్షం నీరు అలాగే నిలిచి ఉంది. వరి గింజలు మెులకెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కనీసం పలకరించడానికి రాలేదని, నష్టపోయిన పంటను నమోదు చేయటానికి అధికారులు పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక ట్రాక్టర్‌తో పంటను తొక్కిస్తున్నారు మోపిదేవి మండలం రైతులు.
ఈ ఏడాది పంట బాగా పండింది.. చేసిన అప్పులు తీరతాయి.. మరో వారం రోజుల్లో పంట కోత కోసుకుందామనుకునే సమయానికి నివర్ తుపాన్ రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. తుపాన్ ప్రభావంతో చేతికొచ్చిన వరి పంట నీట మునిగింది. మరికొంత పంట గాలులకు ఒరిగిపోయింది. వడ్ల గింజలు నీటిలో నానాడం కారణంగా.. మెులకెత్తుతున్నాయి. వరి పంట వేసిన రైతులు ఒక్కో ఎకరాకు సుమారు 40 వేల రూపాయలు నష్టపోయారు. మోపిదేవి మండలంలో పెదప్రోలు, పెదకళ్ళేపల్లి గ్రామాల్లో ఇప్పటికే సుమారు యాభై ఎకరాలు దమ్ము చేశారు. ఇంకా వేలాది ఎకరాలు దమ్ము చేయటానికి రైతులు సిద్ధంగా ఉన్నారు.
నష్ట పరిహారం కోసం నమోదు చేయకపోవడంతో కడుపు మంటతో వరిని నేలపాలు చేస్తున్నారు రైతులు. రెండో పంటగా మినుము వేసుకుందామనుకుంటే ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. పంట నష్టం కింద నమోదు చేయాలని.. అధికారులను కోరగా.. కోత కోసి ఉన్న పంటను నమోదు చేయమని అధికారులు చెప్పినట్టు రైతులు తెలిపారు.
కౌలు కార్డ్ లేకపోతే పంట నమోదు చేయమని.. భూ యజమాని వస్తేనే పంట నమోదు చేస్తామని చెప్పినట్టు కౌలు రైతులు వెల్లడించారు. భూ యజమానులు హైదరాబాదు, బెంగళూరు లాంటి నగరాల్లో ఉన్నారని.. వారు రావడం కుదరదని చెబుతున్నారు. ఈ క్రాప్‌లో నమోదు అయినా.. ఇప్పుడు అన్ని పత్రాలు అడుగుతున్నారని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 350వ రోజు నిరసనలు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు