కొండపల్లి మైనింగ్ పై తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య రాసిన లేఖపై.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ (జాతీయ మానవహక్కుల కమిషన్) స్పందించింది. కొండపల్లి మైనింగ్ వ్యవహారంలో వర్ల రాసిన లేఖపై విచారణకు ఆదేశించింది. వర్ల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి స్పష్టం చేసింది. చేపట్టిన చర్యలపై 8 వారాల్లోగా ఫిర్యాదుదారుకు చెప్పాలని లా రిజిస్ట్రార్‌కు సూచించింది.
ఎన్హెచ్ఆర్సీకి వర్ల లేఖ.. ఏముందంటే
జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపేలా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమ మైనింగ్‌తో పాటు రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆగస్టు 4వ తేదీన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ హెచ్.ఎల్. దత్తుకు లేఖ రాశారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయన్న వర్ల.. అటవీ చట్టాలకు విరుద్ధంగాను, పర్యావరణ హక్కులు ఉల్లంఘించేలా ఈ అక్రమ మైనింగ్ సాగుతోందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో పర్యావరణ పరిరక్షణ ఓ భాగమని.. కొండపల్లి అటవీ ప్రాంతంలో అనేక జాతులకు చెందిన జంతుజాలం, వృక్ష జాలం ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.
మైనింగ్ కోసం కొండపల్లి బొమ్మల తయారీకి ప్రసిద్ధి గాంచిన తెల్లపోని చెట్లను నరికి వేయటం బొమ్మల తయారీ జీవనోపాధికి ముప్పు ఏర్పడిందన్నారు. అక్రమ మైనింగ్ తో ఇప్పటికే 200 ఎకరాలకు పైగా అటవీ ప్రాంతాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తు తరాలకు తీవ్ర నష్టమన్న వర్ల.. ఇందుకు అనుగుణంగానే మాజీ మంత్రి దేవినేని ఉమా జూలై 27 న అక్రమ మైనింగ్‌ను పరిశీలిస్తే గూండాలు ఆయనపై దాడి చేశారని ఆరోపించారు. పోలీసులు అలాంటి వారిని అరెస్టు చేయకుండా దేవినేని ఉమాపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు తెదేపా నియమించిన నిజ నిర్థారణ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా పోలీసులు వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ ను కాపాడేందుకే కృషి చేస్తున్నారన్నది వారి చర్యలతో స్పష్టమైందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.
ఇదీ చదవండి:
AP - TS Water Disputes: రేపే 2 బోర్డుల కీలక భేటీ.. నిలదీసేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధం!