ఒక్కరోజులోనే 3వేల కొవిడ్ పరీక్షలు చేసే సామర్థ్యమున్న ‘కొబాస్ 8800’ యంత్రాన్ని వినియోగించడం తెలంగాణలో ఇదే తొలిసారి అని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ యంత్రం కొనుగోలుకు రెండు నెలల కిందటే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా, దేశంలోకి వచ్చిన మూడు యంత్రాల్లో రాష్ట్రానికి రావాల్సిన మొదటి యంత్రాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్‌కతాకు తరలించిందని ఇటీవల వైద్యమంత్రి ఈటల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పట్టు వదలకుండా నూతన యంత్రం కొనుగోలుకు చేసిన ప్రయత్నాలు ఫలించి, ఇటీవలే రాష్ట్రానికి యంత్రం చేరిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ యంత్రం ఖరీదు రూ.7 కోట్లు.
యంత్రం ప్రత్యేకతలివీ!
- కరోనా నిర్ధారణలో 4 రకాల విధానాలుంటాయి. ఒక్కసారి నమూనాను ఈ యంత్రంలో ప్రవేశపెడితే. అన్ని విధానాల్లో పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఫలితాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది.
- కరోనా పరీక్షలనే కాకుండా.. హెచ్‌ఐవీ, హెచ్‌పీవీ, తదితర దాదాపు 100 రకాల నిర్ధారణ పరీక్షలను చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
- ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంలో రోజుకు 6600 వరకూ ఆర్‌టీ పీసీఆర్ కొవిడ్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ సామర్థ్యం ఉండగా.. ఈ యంత్రం అందుబాటులోకి వస్తే నిర్ధారణ పరీక్షల సామర్థ్యం దాదాపు 10 వేలకు చేరుకుంటుంది. ప్రస్తుతం రోజుకు 24 వేల వరకు యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నారు. మొత్తంగా పరీక్షల సంఖ్యను 40 వేలకు పెంచాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు కొత్త యంత్రం దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్