విజయవాడ సెంట్రల్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న నాగరాజారెడ్డిని.... డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. గతనెల 24 వ తేదీన పటమటలోని సచ్చిదానంద ఆశ్రమ వీధిలో నిర్మిస్తున్న భవనంపై నుంచి వెంకటేశ్వరరావు అనే కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడు. దీనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా... ఇందుకు సంబంధించి ఆ భవన నిర్మాణదారుడిని బెదిరించి... నాగరాజారెడ్డి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై డీజీపీకి ఫిర్యాదు అందడంతో ఆయన విజయవాడ సీపీని విచారణ చేయాల్సిందిగా ఆదేశించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన సీపీ శ్రీనివాసులు తుది నివేదికను పోలీస్ బాస్‌కు నివేదించగా.....అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం సీసీఎస్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న కే.శ్రీనివాసరావును సెంట్రల్ డివిజన్ ఇంచార్జీగా సీపీ నియమించినట్లు సమాచారం. 2019 ఎన్నికలకు ముందు విజయవాడ కమిషనరేట్ కు వచ్చిన నాగరాజారెడ్డి మొదట ట్రాఫిక్ ఏసీపీగా చేరారు. అనంతరం అక్కడి నుంచి సెంట్రల్ ఏసీపీ స్థానానికి బదిలీ అయ్యారు. అయితే అతని పనితీరుపై మొదటి నుంచి అధికారులు అసంతృప్తిగానే ఉన్నట్టు సమాచారం.
ఇవీ చదవండి: రాష్ట్రంలో జగన్ రౌడీ రాజ్యం నడుస్తోంది: లోకేశ్