పుట్టిన వారు మరణించక తప్పదు.. కానీ వ్యక్తి మరణించినప్పుడు నలుగురు వ్యక్తులు శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం కొవిడ్-19తో మనుషులకే కాదు... మనసులకు వైరస్ సోకింది. మానవత్వం మంటగలిసిపోతుంది. తన కొడుకు చనిపోయాక... తోడుంటారనుకున్న బంధువులు.. మెుహం చాటేయడంతో మహిళ మరణానికి కారణమైంది.
అంటురోగం భయంతో ఊరు దూరమైంది... నాలుగు పదుల వయసులోనే కుమారుడి మృతి కలచి వేసింది. మృతదేహాన్ని తరలించే దిక్కులేక... ఓదార్పుగా పలకరించే వారు లేక... ఓ అనాథ శవంలా కుమారుడి మృతదేహానికి బయటవారు అంత్యక్రియలు నిర్వహిస్తే తట్టుకోలేక పోయింది.
కరోనా లక్షణాలతో శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన 43 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. దాదాపు 10 గంటలకు పైగా శవాన్ని పక్కకు జరిపే వారు కూడా లేరు. ఆ దృశ్యాన్ని చూసిన కన్నతల్లి హైమావతి గుండెలు అవిసిపోయాయి. కన్న కొడుకు మృతదేహం ఓ అనాథ శవంలా దిక్కు మొక్కు లేకుండా పడి ఉంటే... మానవత్వం చచ్చిందంటూ ఆ తల్లి సాయంత్రం వరకు విలపిస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. మృతుడి భార్య, తల్లి రోదనను గుర్తించిన స్థానికులు, అధికారుల సాయంతో మృతదేహాన్ని ఖననం చేశారు.
అప్పటినుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్న తల్లి... మౌనంగా రోదిస్తూ ఉండిపోయింది. జరిగిన ఘటనను మరువలేక శనివారం రాత్రి తన దగ్గర ఉన్న నగలు, బంగారాన్ని మంచంపై పెట్టి కనిపించకుండా పొయింది. ఆదివారం ఉదయం ఆమెను పలకరించేందుకు వెళ్లిన బంధువులకు కనిపించకపోవడంతో.. చుట్టుపక్కల వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణానదికి కొద్ది దూరంలోనే ఆమె ఇల్లు ఉండటంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టిన గ్రామస్థులకు సాయంత్రం నాగాయలంకకు 2 కిలోమీటర్ల దూరంలో ఆ తల్లి మృతదేహం లభ్యమైంది. కుమారుడి మరణం, అనంతరం జరిగిన పరిణామాలతో మనస్థాపం చెందే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని గ్రామస్థులు భావిస్తున్నారు. ఆమె మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అనుమతి