కృష్ణాజిల్లా గన్నవరంలో గరిమెళ్ళ సత్యనాగకుమారి (60) అనే వృద్ధురాలు ఆమరణ దీక్ష చేపట్టారు. కుమారుడు వెంకట ఫణీంధ్ర తన ఆస్తులు రాయించుకుని తనను చూడటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి మొత్తం రాయించుకొని కొడుకు అమెరికా పారిపోయాడని వాపోయారు.
సత్యనాగకుమారి భర్త 2001లో గుంటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన చనిపోయిన అనంతరం అతను అప్పటికే చేసిన అప్పులు తీర్చమని కొందరు వేధించడంతో ఇళ్లు, ఇతర ఆస్తులు అమ్మి తీరుస్తానని కుమారుడు గరిమెళ్ళ వెంకటఫణీంద్రచౌదరి తల్లికి చెప్పాడు. దీంతో తనతోపాటు భర్త పేరుమీద ఉన్న ఆస్తులన్నింటినీ నాగకుమారి.. కుమారుడు పేరున రాసింది. భర్త చేసిన రూ.29లక్షల అప్పు తీర్చకుండా కుమారుడు ఉన్నట్టుండి అమెరికా వెళ్లిపోయాడు. తనకు న్యాయం చేయమని గతంలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎస్పీ, ఇలా ఉన్నతాధికారులను సైతం కలిసినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తనను శేషజీవితమైనా ప్రశాంతంగా గడిపేందుకు వృద్ధాశ్రమంలో ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు. ఆస్తులు రాయించుకొని చూడకుండా వదిలేసిన కొడుకుపై చర్యలు తీసుకొనే వరకు ఈ దీక్ష కొనసాగిస్తానని వృద్ధురాలు తేల్చి చెబుతున్నారు. ఆమె దీక్షపై సమాచారం అందుకున్న గన్నవరం తహసీల్దార్ నరసింహారావు బాధితురాలిని పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.