కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైకాపాలో విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. ఓ వైపు వైకాపా నియోజకవర్గ ఇంఛార్జి దుట్టా రామచంద్రరావు, మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తెదేపా తరఫున గెలిచి వైకాపా పంచెన చేరిన వల్లభనేని వంశీకి చుక్కలు చూపిస్తున్నారు. తెలుగుదేశంలో ఉండగా తమను వేధించిన వంశీతో ఎలా కలిసి పనిచేస్తామన్నది దుట్టా, యార్లగడ్డ వర్గీయుల సూటి ప్రశ్న. అందుకే ఏ కార్యక్రమం జరిగినా వర్గపోరుతో అక్కడ చర్చపోయి రచ్చ మిగులుతోంది. తాజాగా కాకులపాడు గ్రామ సచివాలయం శంకుస్థాపనకు వంశీ వెళ్లగా.. తామే శంకుస్థాపన చేస్తామని దుట్టా వర్గం పోటీకి దిగింది. ఇరువర్గాలు తోసుకుంటుంటే సర్దిచెప్పలేక వంశీ తల పట్టుకున్నంత పనైంది.
కాకులపాడు దుమారం మరుసటిరోజే గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీచేసిన ఓడిన యార్లగడ్డ వెంకట్రావు.. వంశీపై విరుచుకుపడ్డారు. గత రాత్రి నున్నలో తలపెట్టిన తన పుట్టినరోజు వేడుకలను పోలీసులు అడ్డుకోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. వాహన శ్రేణితో వచ్చిన వెంకట్రావును ఎన్టీపీసీ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, గుమిగూడడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఐతే కిలో మీటరు మేర కాలినడకన నున్న గ్రామానికి చేరుకున్న యార్లగడ్డ తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యేతోపాటు ఓ మంత్రి.. పోలీసుల్ని అడ్డుపెట్టుకుని తన జన్మదిన వేడుకలు జరగకుండా చూశారని యార్లగడ్డ ఆరోపించారు. వంశీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైకాపాలోకి అడుక్కుని వచ్చిన నాయకులు గన్నవరంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, వంశీ ఎమ్మెల్యేగానే ఉంటాడు తప్ప వైకాపా నాయకుడు కాలేడని తేల్చిచెప్పారు. వంశీతో పనిచేసే ప్రసక్తేలేదని సీఎం జగన్‌కే తేలిచెప్పానని కుండబద్దలు కొట్టారు. తెదేపాలో ఉండగా నియోజకవర్గంలో రచ్చగెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైకాపాలో ఇంట గెలవడానికి ఆపసోపాలు పడుతున్న పరిస్థితిలోకి వెళ్లారనే చర్చ నడుస్తోంది. ఒకవేళ గన్నవరంలో ఉపఎన్నిక వస్తే ఈ వర్గపోరు ఎవరికి చేటు చేస్తుందనేది అధికార పార్టీని కలవరపెడుతోంది.