గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైకాపా రాష్ట్ర రాజకీయ సలహా మండలి సభ్యుడు దుట్టా రామచంద్రరావు వర్గీయుల మధ్య గత కొంతకాలం నుంచి అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఇవి రచ్చకెక్కాయి. వంశీ, దుట్టా ఆయా కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నా, కడప జిల్లాకు చెందిన దుట్టా అల్లుడు శివభరత్‌రెడ్డి వేరుగా నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల జయంతి కార్యక్రమాలు నిర్వహించడం, గన్నవరం మండలం ముస్తాబాదలో వంశీ, దుట్టా వర్గీయులు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే వంశీ తెదేపాను వీడి వైకాపాకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన నాటి నుంచి దుట్టాతో సన్నిహితంగా వ్యవవహరిస్తూ వచ్చారు. దుట్టా వర్గం కూడా వంశీకి మద్దతుగానే ఉన్నట్లు ప్రయాణం కొనసాగింది. నియోజకవర్గంలో సొంత వర్గాన్ని కూడదీసుకునే సన్నాహాలలో భాగంగా ప్రతిరోజూ పర్యటనలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో వర్గపోరు మొదలైంది.
ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. 'నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి ఎవరంటూ..' అడిగిన ప్రశ్నకు 'త్వరలో చూస్తారుగా' అంటూ దుట్టా నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగించింది. ‘మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం జరగకూడదనే తాను రంగంలోకి దిగానని’ దుట్టా తెలిపారు.
వంశీ మాట్లాడుతూ ‘రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఆ ప్రకారమే ఇళ్ల స్థలాల జాబితా రూపొందించాం. అది రుచించకే కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా నియోజకవర్గంలో పని చేసుకుంటూ ముందుకెళ్తా’మన్నారు.
ఇక తెదేపాకు గన్నవరం నియోజకవర్గం కంచుకోటగా ఉంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఏడు సార్లు జయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడింది.కానీ పది నెలలు గడుస్తున్నా పార్టీ ఇంఛార్జిని నియమించకపోవడంతో ఇటీవల బాపులపాడు నాయకులు రాజీనామాలు ప్రకటించారు. జిల్లా నేతలు బుజ్జగించినా శాంతించడం లేదు.
ఇవీ చదవండి: