'సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే.. వైకాపా నేతలు కాలిపోతారు.. జాగ్రత్త' అంటూ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఏకంగా ప్రభుత్వంలోని ఐదుగురు మంత్రులు.. పవన్‌ను టార్గెట్ చేస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందులో మంత్రి పేర్ని నాని మాటల తుటాలు పేల్చారు. పవన్ సంధించిన ప్రతి అంశాన్ని ప్రస్తావించిన ఆయన.. ఘాటుగా బదులిచ్చారు. పవన్ కల్యాణ్ అయినా.. సంఫూర్ణేశ్ బాబు అయినా తమ ప్రభుత్వానికి ఒకటే అంటూ మంత్రి అనిల్ తనదైనశైలిలో వ్యాఖ్యానించారు. ఇక పవన్ కల్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని జనసేన పార్టీ నేతలూ హెచ్చరించారు. వైకాపా నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.
మీరొక్కరే లేరు..చాలా మంది ఉన్నారు
పవన్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తిని రేపాయి. సినిమా టికెట్ల ఆన్‌లైన్(online cinema tickets) అమ్మకాల విధానాన్ని సినిమా డిస్ట్రిబ్యూటర్లే అడిగారు.. వాళ్లకు లేని బాధ పవన్‌కు ఎందుకని ప్రశ్నించారు. వైకాపా మంత్రులు సన్నాసులంటూ.. నోరుందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడతారా అంటూ ధ్వజమెత్తారు. సినిమా ఇండస్ట్రీ(bosta on cenima tickets)లో ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. పరిశ్రమలో పవన్ ఒక్కరే లేరు కదా.. చాలామంది ఉన్నారు. చిరంజీవి, మోహన్‌బాబులాంటి పెద్దలు ప్రభుత్వంతో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. అయితే కేవలం పవన్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్న బొత్స.. చిరంజీవి, మోహన్‌బాబులను పెద్దలుగా ప్రొజెక్ట్ చేయటం.. ఆసక్తిగా మారింది.
సినీ పెద్దలే కోరారు.. పవన్‌కు ఏం సంబంధం? మంత్రి పేర్నినాని
జగన్‌పై విషం చిమ్మేలా పవన్ మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలపై జగన్ ఎలా కక్ష సాధిస్తున్నారో సినీ పెద్దలు చెప్పాలన్నారు. పవన్ సినిమాల ఆదాయంతోనే ప్రభుత్వం నడుస్తుందా? అని నిలదీశారు. గతేడాది జూన్‌లో సినీ పెద్దలు జగన్‌ను కలిసి ఆన్‌లైన్ టికెటింగ్ కోరారని గుర్తు చేశారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో చిరంజీవి కూడా ఉన్నారని చెప్పారు. ఆన్‌లైన్ టికెటింగ్‌తో పవన్ కల్యాణ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. టికెట్ల విక్రయానికి ప్రభుత్వం పోర్టల్ మాత్రమే నడుపుతుందని స్పష్టం చేశారు. సినిమా టికెట్లను థియేటర్ యాజమాన్యాలే అమ్ముకుంటాయన్న మంత్రి.. వసూలైన డబ్బు మర్నాడే ఎవరిది వారికి చేరుతుందని వ్యాఖ్యానించారు. ఇడుపులపాయలో డబ్బుంటే మోదీ, అమిత్‌షాకు చెప్పి విచారణ జరిపించాలని సవాల్ డిమాండ్ చేశారు.
పవన్.. సంపూర్ణేశ్ బాబు ఒకటే..
''ప్రతిదీ పారదర్శకంగా జరగాలనుకోవడం తప్పా.. ప్రభుత్వానికి ఏ హీరో సినిమా అయినా ఒకటే! ‘మేమంతా కళామతల్లి ముద్దు బిడ్డలం’ అని మీరే చెబుతారు. అలాంటప్పుడు పవన్‌కల్యాణ్ అయినా.. సంపూర్ణేశ్‌బాబు అయినా మాకు ఒకటే. టికెట్ రేటు అనేది పెద్దవాడికి ఒకలా.. చిన్నవాడికి మరోలా ఉండకూడదు. ఇద్దరికీ సమానం ఉండాలి. ‘నాకు ఎక్కువమంది అభిమానులు ఉన్నారు రూ.100 టికెట్.. రూ.200 కొనండి’ అని ఎవరైనా చెబుతారా? దాన్ని అభిమానాన్ని క్యాష్ చేసుకోవడం అంటారు’’ అంటూ పవన్ పై మంత్రి అనిల్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు.
వైకాపా నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి: పోతిన మహేశ్
వైకాపా ప్రభుత్వంపై జనసేన నేత పోతిన మహేశ్(Janasena leader pothina Venkata Mahesh) విమర్శలు చేశారు. సినిమా పరిశ్రమపై వైకాపా దోపిడీని జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) వివరిస్తే.. వైకాపా మంత్రులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజల సమస్యలు కన్నా.. సినిమా టిక్కెట్లు అమ్ముకోవడమే జగన్‌కు ముఖ్యమా అని ప్రశ్నించారు. పవన్‌పై సీబీఐ కేసులున్నాయా.. ప్రజలను దోచుకున్నారా అని మహేశ్ ప్రశ్నించారు. తడిగుడ్డతో గొంతులు కోసే నైజం జగన్‌దని మండిపడ్డారు. సొంత బాబాయి హత్య జరిగితే దోషులను పట్టుకోలేకపోయారని విమర్శించారు. వేలాది మంది కష్టంతో సినిమా తీస్తే.. వైకాపా కార్యకర్తలతో బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మిస్తారా..? అని ప్రశ్నించారు.
పవన్..10 తర్వాత చూసుకుందాం: మోహన్ బాబు
సినిమా టిక్కెట్ల అంశంపై మోహన్ బాబు స్పందించాలన్న పవన్ వ్యాఖ్యలకు.. ట్విటర్ వేదికగా బదులిచ్చారు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. 'మా' ఎన్నికల(MAA elections 2021) తర్వాత ప్రశ్నలకు జవాబునిస్తానని రిప్లే ఇచ్చారు. 'మా' ఎన్నికల్లో విష్ణు ప్యానెల్‌కు(Maa elections vishnu panel) ఓటేసి గెలిపించాలని పవన్‌ను కోరారు. అయితే జనసేన వర్సెస్ వైకాపా మాటల యుద్ధంపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, మోహన్ బాబులను సినీ పెద్దలంటూనే... పవన్‌ను మంత్రులు టార్గెట్ చేయటం పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతుందంటున్నారు.
రిలీజ్ ఈవెంట్లో పవన్ ఏమన్నారంటే..
శనివారం ఓ మూవీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైకాపా ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన పవన్.. మీడియాకు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను లేవనెత్తారు. వైఎస్ వివేకా హత్య గురించి మీడియా మాట్లాడాలని పవన్ డిమాండ్ చేశారు. కోడికత్తితో ఒక నేతను పొడిచారు, ఆ కేసు ఏమైంది? అని ప్రశ్నించారు. పోడుభూమి సాగు చేసుకునే గిరిజనుల గురించి మాట్లాడాలని పవన్ సూచించారు. వైకాపా ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? అని నిలదీశారు. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారని ప్రశ్నించిన పవన్... రాజకీయ హింస గురించి మాట్లాడాలని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే జనసేన వర్సెస్ వైకాపా నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
ఇదీ చదవండి