Perni Nani: సమాజంలో వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని రాష్ట్ర రవాణా, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. వేధింపులు, ఆరోగ్య సమస్యల నుంచి సంరక్షించేందుకు అందరూ చొరవ చూపాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. గురువారం స్థానిక ఈడేపల్లిలో జెట్టి నరసింహ స్మారక వృద్ధాశ్రమాన్ని మంత్రి సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
వయసు రీత్యా పెద్దవాళ్లు మహావృక్షాల్లాంటి వారని, ఆధునిక జీవన శైలితో నిత్యం అశాంతిగా బతికే నేటి యువతకు చల్లని నీడనిచ్చి సేద తీరుస్తారని, అందుకే వారిని అభిమానించాలని హితవు పలికారు. వృద్ధుల సంరక్షణ వారి పిల్లల బాధ్యతని, వయసుడిగిన దశలో వారి పిల్లల నుంచి కోరుకునేదీ కేవలం ప్రేమ పూర్వక పలకరింపులు, ఆదరణ, అభిమానాలు తప్ప ఆడంబరాలు, విలాసాలు కాదని, ఈ విషయం వారి పిల్లలు గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని వెంట మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, మాజీ మునిసిపల్ ఛైర్మన్ షేక్ సలార్ దాదా, రిటైర్డ్ జడ్జి జెట్టి కృష్ణమూర్తి, మచిలీపట్నం మాజీ జెడ్పీటీసీ లంకె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు బోగాది సాయిబాబు, రామ్ ప్రసాద్, మహ్మద్ సాహెబ్, శ్రీహరి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విశాఖ కేజీహెచ్‌లో అపహరణ.. శ్రీకాకుళం జిల్లాలో గుర్తించిన పోలీసులు