కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్రల ఆరోపణల పర్వం కొనసాగుతోంది. కక్షసాధింపు చర్యల్లో భాగంగా తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలను పేర్ని నాని ఖండించారు. వైకాపా ప్రభుత్వాన్ని, తనను రాజకీయంగా ఎదుర్కోలేక... కేసులు పెట్టే విధంగా రవీంద్ర వ్యవహరిస్తున్నాడన్నారు. చట్టాన్ని తానే చేతుల్లోకి తీసుకోవటం, రౌడీ రాజకీయాలు చేయడం, అందుకు తగిన సాక్ష్యాలు ఉండటం వల్లే ఇటీవల అతనిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. సానుభూతి సంపాదించుకునేందుకు నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలంటూ హితవు పలికారు.
తెదేపా నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు, అనుచిత వైఖరిపై విచారణ చేయించాలని కోరుతూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు, బెదిరింపులతో ప్రతిపక్షాన్ని అడ్డుకోవాలనుకోవడం అవివేకమని ఆయన అన్నారు. ఈ విషయంలో తమ సహనం నశించిందని.. ఇకపై అందుకు తగ్గుట్లుగా వ్యవహరించడంతో పాటు ప్రైవేటు కేసులు పెట్టేందుకు కూడా వెనకాడేది లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: మెడ్‌టెక్ జోన్లో పెండింగ్ బిల్లులకు తొలి విడతగా రూ.5కోట్లు మంజూరు