ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిన నేతగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు. ప్రత్యేక హోదా మా హక్కు అని నినదించిన సమయంలో ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించారని, ఇప్పుడు ప్రత్యేక హోదాను వైకాపా ప్రభుత్వం నీరుగార్చిందని చంద్రబాబు విమర్శించడం దారుణమన్నారు. మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు కలసి తిరుపతి సభలో ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఆ హామీలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా కోసం గతంలో ఎంపీలను రాజీనామా చేయించిన చరిత్ర వైఎస్ జగన్‌దని కన్నబాబు అన్నారు. ప్రత్యేక హోదా మా హక్కు అంటూ ఈరోజు కూడా తాము నినదిస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ సహా వైకాపా ఎంపీలంతా ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నారని స్పష్చం చేశారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలసినప్పుడల్లా హోదా గురించి అడుగుతూనే ఉన్నారని వెల్లడించారు.
పంట నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తోందని... రైతులకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బాకీ లేదన్నారు మంత్రి కన్నబాబు. గతంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తుంటే చంద్రబాబు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయశాఖను మూసేశారని అసత్యాలు చెబుతున్నారని, తెదేపా హాయాంలో వ్యవసాయ శాఖను మూసేస్తే వైఎస్ జగన్ తెరిచారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి
Gautam Sawang Transfer: గౌతమ్ సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్‌రెడ్డి