అన్ని జిల్లాల డీసీసీబీలు, డీసీఎంఎస్‌ల పనితీరుపై వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కన్నబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో పలుచోట్ల డీసీసీబీలలో చాలా అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల డీసీసీబీల పనితీరు మిగిలిన జిల్లాలకు ఆదర్శం కావాలన్నారు.
బ్యాంకుల్లో అయిదేళ్లు దాటిన మేనేజర్ల బదిలీలు ఉంటాయని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక రుణాల విషయంలో ఆప్కాబ్ రుణ పరిమితులు పెంచేలా ఆలోచనలు చేయాలని సూచించారు. డీసీసీబీలు, డీసీఎంఎస్, పాక్స్‌కు త్వరలో ఎన్నికలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. బ్యాంకుల లావాదేవీలను ఆడిటింగ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్థోమత ఉండి కూడా రుణాలు చెల్లించని వారి నుంచి రికవరీలు పెరగాలని అధికారులకు ఆదేశించారు.
తొలిదశలో చిత్తూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లో అముల్ ప్రాజెక్టులకు బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకులని నష్టపరిచే చర్యలని ఉపేక్షించబోమని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. బ్యాంకింగ్, ఆర్ధిక రంగంలో నిపుణులను పిఎసిఎస్, డిసిసిబిలలో డైరక్టర్లుగా తీసుకునేలా చట్టంలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. సహకార శాఖ ఉద్యోగుల జీతభత్యాలని సరిచేస్తామన్నారు. సొసైటీ బైఫరికేషన్ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. పిఎసిఎస్‌లలో రికార్డుల ట్యాంపరింగ్ అతి పెద్ద లోపంగా కనిపిస్తోందని మంత్రి తెలిపారు. సొసైటీలు కంప్యూటీకరణ చేయకపోవడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయన్నారు. కౌలు రైతులకు ఇతర జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువగా రుణాలివ్వాలని మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి : Fee: ఫీజు నియంత్రణ జీవోలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు