ETV Bharat / state

రాష్ట్రంలో ఎల్పీజీ శ్మశాన వాటికల ఏర్పాటుకు సన్నాహాలు - ఎల్పీజీ శ్మశానవాటికలు న్యూస్

రాష్ట్ర వ్యాప్తంగా ఎల్పీజీ ఆధారిత శ్మశాన వాటికలను నిర్మించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఈ పనులకు సంబంధించిన పనులు వచ్చే నవంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

minister botsa
మంత్రి బొత్స
author img

By

Published : Jul 29, 2020, 3:09 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 51 కోట్ల 48 లక్షల రూపాయల అంచనా వ్యయంతో.. కొత్తగా 38 దహన వాటికలను నిర్మించబోతున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున ఉండేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నవంబరు నెలాఖరు కల్లా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

పట్టణ ప్రాంతాల్లో మరణించిన వారి అంతిమ సంస్కారాల నిర్వహణకు సరైన సదుపాయాలు లేవన్నారు. పర్యావరణహితంగా, ఎల్పీజితో నిర్వహించేలా దహన వాటికల నిర్మాణం, శ్మశానాల్లో మౌలిక వసతుల కల్పన వంటివి ఈ పనుల్లో భాగంగా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొవిడ్ పరిస్థితులు, సంప్రదాయబద్ధంగా కర్రలను ఉపయోగించి దహనం చేస్తోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని... అంత్యక్రియల నిర్వహణకు పర్యావరణ హితమైన ఏర్పాట్లు ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల అంతిమ సంస్కారాల నిర్వహణలో దురదృష్టకరమైన అమానవీయ సంఘటనలు చోటు చోసుకోవడంపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు నిలువరించటానికి... పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశలో ప్రభుత్వం దహన వాటికల నిర్మాణం, శ్మశానాల్లో వసతుల కల్పన పనులను చేపడుతోందన్నారు.

కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా అమలులో ఉన్న ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని, అంత్యక్రియలనేవి గౌరవప్రదమైన రీతిలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆయా శ్మశాన వాటికల్లో గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ ఆధారిత చిమ్ని, కార్యాలయ భవనం, సంప్రదాయబద్దంగా కార్యక్రమాల నిర్వహణకు అనువైన హాల్ , టాయిలెట్లు, నీటి సరఫరా, డ్రైనేజి లేన్ నిర్మాణం తోపాటు ఇతరత్రా ల్యాండ్ స్కేపింగ్ పనులు, ప్రహారీ నిర్మాణం వంటి పనులను ఈ నిధులతో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతోపాటు, పర్యావరణహితంగా ఉండేలా ఎల్పీజీ ద్వారా దహనవాటికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హిందూపుర్, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 3 చొప్పున దహన వాటికలు, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, కడప, కర్నూలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 చొప్పున, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కొకటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. వచ్చే నవంబరు నెలాఖరు నాటికల్లా ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా చూడాలని ప్రజా ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ చీఫ్‌ను మంత్రి బొత్స ఆదేశించారు.

ఇదీ చదవండి: ఆగస్టు 5న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.