కరోనా మహమ్మారి జాగ్రత్తలు తీసుకుంటూ జూలై 10 తేదీ నుంచి 15 వరకు పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విజయవాడలోని సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు, ఎమ్ఈవోలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి సలహాలు, సూచనలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరం వంటి జాగ్రత్తలు పాటిస్తామని తెలిపారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో కరోనా నివారణ జాగ్రత్తలు వివరిస్తూ.. అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రతి గదికి పది నుంచి 12 మంది విద్యార్థులు మించకుండా ఉండేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి కేంద్రానికి విద్యార్థులతో పాటు ఎక్కువమంది రాకుండా కట్టడి చేసేందుకు పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. ఆరోగ్యం, నియంత్రణలకు సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ నుంచి, జిల్లా పరిపాలనశాఖల సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్ల నుంచి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటుతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జులై 11 నుంచి 18 వరకు జరుగుతాయని మంత్రి అన్నారు. ఈ పరీక్షలు కూడా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తామన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని.. ఒకసారి తప్పిన మరో అవకాశం ఉందని సూచించారు. పిల్లలు భావోద్వేగానికి గురి కాకుండా తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పాఠశాలవిద్యా ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్ చినవీరభద్రుడు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వలస కార్మికుల పిల్లల వివరాలు, బడి బయటి ఉన్న పిల్లల వివరాలను నమోదు చేయించాలని అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లను, జిల్లా విద్యాశాఖాధికారులను మంత్రి కోరారు.
ఇదీ చూడండి. 2 రోజుల సమావేశాలు.. సొంత అజెండా అమలుకే: తెదేపా