టీకా నిల్వ చేసేందుకు ఉపయోగించే భారీ ఐస్ లైన్డ్ రిఫ్రజిరేటర్లు (లార్జ్-ఐఎల్‌ఆర్) 36 ఇప్పటికే కృష్ణా జిల్లా గన్నవరంలోని వ్యాక్సిన్లు భద్రపరిచే రాష్ట్ర ప్రధాన కేంద్రానికి చేరాయి. వీటిని సోమవారం నుంచి నిర్దేశిత కేంద్రాలకు పంపనున్నారు. త్వరలోనే ఆరు వాక్-ఇన్-కూలర్స్ రానున్నాయి. మూడింట్లో 40 వేల లీటర్లు, మరో మూడింట్లో 16,500 లీటర్ల చొప్పున టీకాను భద్రపరుస్తారు.
పక్కాగా నిఘా, పర్యవేక్షణ
టీకాలు భద్రపరిచే కేంద్రాల్లో 50 సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. గన్నవరంలోని ప్రధాన కార్యాలయంతో పాటు విశాఖ, గుంటూరు, కడప, కర్నూలు ప్రాంతీయ, జిల్లా కేంద్రాల్లో వీటిని బిగించి... వైద్య ఆరోగ్య శాఖ కమాండ్ కంట్రోల్ గదికి అనుసంధానిస్తారు. టీకా చోరీ, దుర్వినియోగం కాకుండా పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం గర్భిణులు, చిన్నారులకు వేసే వ్యాక్సిన్ రవాణాకు రాష్ట్రంలో 26 వాహనాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 25 వాహనాలు రానున్నాయి. వీటి కదలికలను జీపీఆర్‌ఎస్ సాంకేతికతతో పర్యవేక్షించడంతో పాటు ప్రతి వాహనంలో ఓ పోలీసును కాపలాగా నియమిస్తారు.
‘డ్రై రన్’తో అవగాహన
కృష్ణా జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించే టీకా ‘డ్రై రన్’తో కొవిన్ యాప్ పనితీరును ఆరోగ్య కార్యకర్తలు తెలుసుకొంటారని, ప్రజల్లోనూ అవగాహన వస్తుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆరుకు చేరిన ‘బ్రిటన్’ కేసులు
బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. వీరి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో పాజిటివ్ ఉన్నట్లు గుర్తించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి, గుంటూరు జిల్లాలో ఇద్దరికి చొప్పున వైరస్ నిర్ధారణ అయింది. గత నెల రోజుల్లో యూకే నుంచి రాష్ట్రానికి 1,214 మంది వచ్చారు. వీరిలో 1,158 మంది చిరునామాలు గుర్తించారు. ఇందులో 1,101 మంది క్వారంటెయిన్‌లో ఉన్నారు. యూకే నుంచి వచ్చినవారిలో కొత్త స్ట్రెయిన్ వైరస్‌ను గుర్తించేందుకు బాధితుల నమూనాలు పుణెకు పంపించినట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటంనేని వెల్లడించారు.
* బ్రిటన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 18 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బ్రిటన్ నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురికి కరోనా సోకింది.
ఇదీ చదవండి: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు