కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త బంద్‌లో భాగంగా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాలలో బంద్ కొనసాగుతోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా సహకరిస్తున్నారు.
విజయవాడలో..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బంద్‌లో భాగంగా విజయవాడ గొల్లపూడి సెంటర్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్వ ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తాకట్టు పెట్టారని రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పని తీరును నిశితంగా పరిశీలించి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని దేవినేని విమర్శించారు.
భారత్ బంద్ కు అధికార వైకాపా, తెదేపా, కాంగ్రెస్ సీపీఐ, సీపీఎం సహా వాటి అనుబంధ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో నిలిచిన వివిధ జిల్లాల మధ్య నడిచే బస్సులు నిలిచిపోయాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘాలు నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, కార్మిక పరిషత్ సహా ఇతర సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టాయి. సీపీఎం నేత మధు, బాబూరావు , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పలు వామపక్ష, తెదేపా అనుబంధ ఆటో,కార్మిక సంఘాల నేతలు కార్మికులు పాల్గొన్నారు.
గన్నవరంలో...
గన్నవరంలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్‌కు ప్రభుత్వం, అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. సత్వరమే వాటిని వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాని మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చెన్నై-కోల్‌కతా రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంబించింది.
నందిగామలో..
నూతన వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నందిగామలో భారత్ బంద్ నిర్వహించారు. దుకాణ సముదాయాలు మూతబడ్డాయి.
నూజివీడు నియోజకవర్గ పరిధిలో..
వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, రైతు సంఘాల సమాఖ్య, సంయుక్త కిసాన్ మోర్చాల పిలుపు మేరకు భారత్ బంద్ కొనసాగుతోంది. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
గుడివాడలో...
గుడివాడలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిలపక్షం పిలుపునిచ్చిన బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ మద్దతుతో ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. వ్యాపారస్తులు బంద్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు. .
కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు వ్యతిరేక చట్టాలకు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తెదేపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు నిరసన ర్యాలీలు చేపట్టాయి.
పామర్రులో...
పామర్రు నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారత్ బంద్‌లో భాగంగా కూచిపూడి, మొవ్వ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు అఖిలపక్ష నాయకులు నిరసన చేపట్టారు.
ఇదీ చదవండి: భారత్ బంద్‌ను విజయవంతం చేయండి: అచ్చెన్నాయుడు