కొత్తగా ఏర్పడిన కృష్ణా జిల్లా కొండపల్లి నగర పంచాయతీ ఛైర్మన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. 29 స్థానాలున్న పట్టణంలో వైకాపా, తెదేపాలు చెరిసమానంగా 14 చొప్పున గెలుచుకోగా, మరో వార్డులో తెదేపా రెబల్ అభ్యర్థి గెలుపొందారు. ఆ అభ్యర్థి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాకు మద్దతు పలికారు. ఇప్పుడా పార్టీ బలం 15కు చేరింది. ఛైర్మన్ ఎన్నికకు ఎక్స్‌అఫిషియో ఓట్లు కీలకంగా మారాయి. రిజర్వేషన్ ప్రకారం ఛైర్మన్ పీఠం బీసీ జనరల్‌కు కేటాయించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్స్‌అఫిషియో సభ్యునిగా ఈ పట్టణానికి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) కూడా ఇక్కడే ఆప్షన్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. గతంలో ఆయన జగ్గయ్యపేటను ఎంచుకున్నారు. 2019లో గెలిచాక విజయవాడ కార్పొరేషన్‌కు మారినా.. ఇటీవలి ఎన్నికల్లో అక్కడ ఓటు వేయలేదు. ఆయన కొండపల్లికి ఆప్షన్ ఇచ్చేందుకు అర్హత ఉందా.. లేదా.. అన్నది ఎన్నికల సంఘం తేల్చాల్సి ఉంది. ఒకసారి ఆప్షన్ ఇచ్చినందున మార్చే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన తెదేపా, వైకాపాలు సమ ఉజ్జీలుగా నిలవనున్నాయి. ఆ పరిస్థితి ఉత్పన్నమైతే.. టాస్ కీలకం కానుంది. అయితే, అధికార పక్షానికి మరో అవకాశం కన్పిస్తోంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి గొల్లపూడికి చెందిన తలశిల రఘురామ్ బరిలో ఉన్నారు. ఆయన ఎన్నిక లాంఛనమే. ఆయన ఓటు హక్కు మైలవరం నియోజకవర్గంలో ఉన్నందున స్థానికుడిగా కొండపల్లిలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా చేరే అవకాశం ఉంది. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక 22న కాగా.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. మరోవైపు, ఒకటో వార్డు ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, రీకౌంటింగ్ చేయాలని తెదేపా డిమాండ్ చేస్తోంది.
ఇదీ చదవండి: PADAYATRA : అమరావతి రైతుల మహా పాదయాత్రకు నేడు విరామం