కలంకారీ హస్తకళలు ప్రియంగా మారాయి. గత నెల రోజులుగా పెరుగుతున్న కాటన్ వస్త్ర ధరలు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతూ పెనుభారంగా మారాయి. కలంకారీకి ముడిసరకుకుగా ఉన్న కోరా వస్త్రం ధర దాదాపు 25 శాతం పెరగడంతో హస్తకళల ధరల్ని పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. రానున్న ఆర్నెళ్లపాటు ఇదే పరిస్థితి ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాటన్ వస్త్రాలకు ఎగుమతులు ఒక్కసారిగా పెరగటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
కృష్ణా జిల్లాలోని పెడనలో కలంకారీ విస్తరించింది. ఈ పరిశ్రమకు అవసరమైన కాటన్ వస్త్రం తమిళనాడులోని ఈరోడ్, తిరుపూర్, కొయంబత్తూరు ప్రాంతాల్లోని మిల్లుల్లో ఉత్పత్తి అవుతుంది. కలంకారీలో ఫ్యాబ్రిక్స్, దుప్పట్లు, చీరలు, డ్రెస్ మెటీరియల్, ఫర్నిషింగ్... ఇలా వివిధ రకాల ఉత్పత్తులను కాటన్ వస్త్రాలతో రూపొందిస్తారు. కలంకారీలో లక్షల మీటర్లలో ఉత్పత్తయ్యే ఫ్యాబ్రిక్‌కు 30/30 రకం క్లాత్‌ను వినియోగిస్తారు. గత డిసెంబరుతో పోల్చితే దీని ధర మీటరు రూ.30 నుంచి రూ.40కు పెరిగింది. చున్నీలు, వివిధ పరిమాణాల్లో దుప్పట్లకు అవసరమైన క్లాత్‌లో కూడా ఇదే రీతిలో మీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకు పెరుగుదల కన్పిస్తోంది. ఫలితంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. 60/90 బెడ్‌షీట్ క్లాత్ మీటరు గతంలో రూ.50 ఉంటే ప్రస్తుతం రూ.65కు పెరిగింది. అలాగే 90/108 తదితర సైజుల్లో కూడా ఇదే పెరుగుదల కన్పిస్తోంది.
విదేశాలకు ఎగుమతులు..
తమిళనాడు నుంచి విదేశాలకు కాటన్ వస్త్రాలు ఎగుమతి అవుతాయి. చైనా నుంచి కొన్ని దేశాలు దిగుమతులను నిషేధించటంతో తమిళనాడులోని మిల్లులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వివిధ దేశాల నుంచి లక్షల మీటర్ల ఆర్డర్లు రావటం ఒక్కసారిగా ధరల పెరుగుదలకు కారణమైంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక రంగుల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో రూ.1200 ఉన్న అలజిరిన్ రెడ్ బీ ధర రూ.2000కు చేరింది. కలంకారీ చీరల డెయింగ్ కోసం వినియోగించే కొన్ని రసాయనాల ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి చైనా నుంచి భారత్‌కు దిగుమతులను నిషేధించటం ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా నీలం, పచ్చ రంగుల కోసం వినియోగించే రసాయనాల ధరలు దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. గతంలో రూ.1000 ఉన్న వీటి ధరలు ప్రస్తుతం రూ.6 వేలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కలంకారీతోపాటు చేనేత వస్త్రాల ధరలను పెంచే దిశగా ఉత్పత్తిదారులు యోచిస్తున్నారు.
ఇదీ చదవండి:
ప్రకృతి వనాలతో ఆహ్లాదం, ఆరోగ్యం: మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్