కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం తమిరిశలో పేకాట శిబిరంలో ఎస్ఈసీ దాడి ఘటనపై మంత్రి కొడాలి నాని ఏమంటారని జనసేన నేత పోతిన మహేశ్ నిలదీశారు. పేకాట శిబిరాలు మూసివేశామని గొప్పలు చెప్పిన మంత్రి.. ఇప్పడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మంత్రి పేకాట శిబిరాలపై గుడివాడ నడిబొడ్డున పవన్ చెప్పారని పోతిన మహేశ్ అన్నారు. గుడివాడ పోలీసులు ధైర్యంగా దాడులు చేయడం అభినందనీయమని అన్నారు. పేకాట శిబిరంపై దాడి ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
'మా అధ్యక్షుడు పవన్ వకీల్ సాబ్ కాబట్టే వాస్తవాలు చెప్పారు. తన అనుచరులను పేకాట కేసు నుంచి తప్పించేందుకు మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. పేకాట శిబిరంలో మంత్రి అనుచరులు విజయ్, సురేంద్ర కీలకంగా ఉన్నారు. అనుచరుల కోసమే మంత్రి తాడేపల్లి రాజప్రాసాదానికి పరిగెత్తారు.' - జనసేన నేత పోతిన మహేశ్
డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి పేకాట శిబిరం వెనుక వ్యక్తుల వివరాలు వెల్లడించాలని పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాపట్ల నిజాంపట్నంలో అతి పెద్ద భారీ పేకాట శిబిరం నడుస్తోంది అన్నారు. మచిలీపట్నంలో మరో మంత్రి అక్రమాలు త్వరలో బయటపెడతామని పోతిన మహేశ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: గుడివాడ నియోజకవర్గంలో జూద శిబిరాలపై దాడులు.. రూ.42 లక్షలు స్వాధీనం