Irregularities in Voter Lists in Joint Krishna District: కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆగస్టు 22 నుంచి అక్టోబరు 22 వరకు రెండు నెలల పాటు బీఎల్వోలు ఓటర్ల జాబితాలను పరిశీలించారు. అందులో ఓటర్ల తొలగింపులు, మార్పులు, చేర్పులు లాంటి సవరణలు చెయ్యాలి. అయితే బీఎల్వోలు ఇంటింటికీ తిరగకుండా సచివాలయాల్లో కూర్చుని వాలంటీర్లు ఇచ్చిన ఆదేశాలను పాటించారనే విమర్శలు ఉన్నాయి. అక్టోబరు 27న ముసాయిదా జాబితాను ప్రకటించారు.
ఇది ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో డిసెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని అన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వాటికి సంబంధించి ఫిర్యాదులు స్వీకరించారు. అయినా వాటిపై స్పందన రాలేదు. తిరిగి డిసెంబరు 3, 4 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబరు 26 నాటికి సమస్యలను పరిష్కరించి జనవరి 5వ తేదీకి తుది జాబితా ప్రకటిస్తారు. ఇదే తుది జాబితా.. దీనితోనే ఎన్నికలకు వెళతారు. ఈ జాబితాలో ఓటు హక్కు ఉంటేనే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కోల్పోయినట్లే.
ఓట్ల వేటలో అరాచకీయం! మనకు అనుకూలంగా లేకుంటే లేపేయ్ - ఉన్నతాధికారులకు వైసీపీ నేతల హుకుం?
కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా అభ్యంతరాలు పెనమలూరు, బందరు నియోజకవర్గాస నుంటి వచ్చాయి. మచిలీపట్నం నియోజకవర్గంలో 25 వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గంలో 15వేల ఓట్లు వేరే నియోజకవర్గం నుంచి చేర్పించారని, వీటిని వెంటనే తొలగించాలని, డబుల్ ఎంట్రీ ఓట్లు 10వేల వరకు ఉన్నాయని మాజీ మంత్రి పేర్ని నాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో ఓటర్ల జాబితా సవరణ సక్రమంగా జరగలేదని పెర్ని అంగీకరిస్తున్నట్లే కదా. ఎన్నికల సంఘం అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా జిల్లా స్థాయిలో అడ్డుపడిన అదృశ్య వ్యక్తి ఎవరనే చర్చ సాగుతోంది.
గన్నవరం నియోజకవర్గం పరిధి రామవరప్పాడులో దాదాపు 500 ఓట్లు నమోదయ్యాయి. ఇవి మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలోనూ ఉన్నాయి. వీటిపై మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు పద్మాశేఖర్ ఫిర్యాదు చేసినా స్పందన లేదు. బాపులపాడు మండలంలో రేమల్లేలో సుమారు 36 మంది, కొత్తపల్లిలో 175 మంది మృతుల ఓట్లను జాబితాల నుంచి తొలగించాల్సి ఉంది. నియోజకవర్గంలో బూత్‌కు సగటున 30 మంది చొప్పున 6 వేల ఓట్లు మృతులవి ఉన్నట్లు టీడీపీ నాయకుల పరిశీలనలో తేలింది. పెనమలూరు నియోజకవర్గంలో మరణించిన వ్యక్తుల పేర్లు ఇంకా జాబితాలోనే ఉన్నాయి. దాదాపు 5వేల మంది పైగా ఉన్నట్లు టీడీపీ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. తాజా ముసాయిదాలో వాటిని తొలగించకుండానే ప్రచురించారు.
ఉంగుటూరులో అధికార పార్టీ అరాచకం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు యత్నం
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మంది మృతుల ఓట్లు తొలగించకుండా కొనసాగించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు వీఎంసీ కమిషనర్‌కు వివరాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇంతవరకు ఇంటింటీ పరిశీలన చేపట్టలేదు. ఇదే నియోజకవర్గంలో ఓ చెట్టుకు ఓటు హక్కు కల్పిస్తూ.. జాబితాలో ప్రచురించడం సంచలనం సృష్టించింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొండా కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఈ క్రమంలోనే మృతుల పేరుతో బోగస్ ఓట్లు వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తూర్పు నియోజకవర్గంలోనూ 11,194 అభ్యంతరాలు వచ్చాయి. మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడిలోని ఓ అపార్టుమెంట్‌లో దాదాపు 76 ఓట్లు నమోదయ్యాయి. వారిలో ఒక్కరూ అక్కడ స్థానికంగా నివాసం ఉండటం లేదు. వీటిని తొలగించాలని ఫిర్యాదు చేసినా స్పందించలేదు. కొండపల్లిలో గత పురపాలక సంఘం ఎన్నికల్లో ఇస్టానుసారం బయటి ప్రాంతాల వారిని ఓటర్లుగా నమోదుచేశారు. అక్కడ ప్రస్తుతం ఎవ్వరూ లేకపోయినా తొలగించలేదు. ఒక్క కొండపల్లి పరిధిలోనే దాదాపు వెయ్యి మందికి పైగా బోగస్ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు.