మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(konda vishweshwar reddy) విసిరిన వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay on white challenge) ప్రకటించారు. డ్రగ్స్ విషయంలో ఏ సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఛాలెంజ్‌లు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై మాట్లాడితే రాజద్రోహం కేసులు పెడతామంటున్నారని తనపై కేసు పెట్టి చూడాలన్నారు.
సీఎం కేసీఆర్(CM KCR) రైతుబంధు ఇచ్చి అన్నీ బంద్ చేశారని సంజయ్ ఆరోపించారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు జీతాలు ఎందుకు పెంచలేదని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామయాత్ర తరువాత ఎక్కడికైనా వస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 2లోపు పోడు భూముల సమస్య పరిష్కరించాలని సీఎంను కోరారు. లేనిపక్షంలో ఫాంహౌజ్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
ప్రజల సంగ్రామ యాత్ర నుంచి ప్రజల నుంచి దృష్టి మరలించడానికి ఛాలెంజ్‌లు చేస్తున్నరు. డ్రగ్స్ కేవలం బలిసిన వాళ్లే తీసుకుంటరు. పేదలు ఎందుకు డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు. కొండా విశ్వేశ్వరన్న నాకు వైట్ ఛాలెంజ్ విసిరిండు. అన్న నీ సవాల్‌కు నేను సిద్ధం. పాదయాత్ర ముగిశాక ఎక్కడికైనా వస్తా. ఏ సవాల్‌కైనా నేను సిద్ధంగా ఉన్నా.- బండి సంజయ్, భాజపా తెలంగాణ అధ్యక్షుడు