తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలో పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మినరసింహ ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని సత్యనారాయణ వ్రతాలు చేసేందుకు ప్రజలు తరలిరావడంతో మండపాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామునే కార్తిక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీసుకున్నారు.భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతోంది.
శివాలయాలలో పార్వతిపరమేశ్వరులకు అభిషేక, అర్చనలు జరిపిస్తున్నారు. ఉదయం నుంచి విడతలవారీగా సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నారు. కరోనా వల్ల ఒక్క బ్యాచుకు వంద మంది మాత్రమే అనుమతిస్తున్నారు. కార్తిక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించి స్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భద్రతా కారణాలతో కొండపైకి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు.