విజయవాడలో ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది . రోడ్లన్నీ జలమయ్యాయి. విజయవాడ రూరల్, గన్నవరం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో వాగులు పొంగాయి. చంద్రవంక వాగు ఉద్ధృతితో జమ్మలమడక వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. రాకపోకలు నిలిచిపోయాయి.
తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై పొంగిపొర్లింది. రైల్వే అండర్ బ్రిడ్జి కింద ఆర్టీసీ బస్సు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. కాకినాడలోనూ వర్షం పడింది. రాజానగరం, మండపేట, కాజులూరు తడిసిముద్దయ్యాయి. ఏలేశ్వరం, జగ్గంపేట మండలాలను కలిపే కాజ్‌వే వంతెన ఏలేరు నీటి ఉద్ధృతికి కుంగిపోయింది. వంతెనను మాజీ మంత్రి చినరాజప్ప సహా తెదేపా నేతలు పరిశీలించి.. సాధ్యమైనంతవరకూ కాజ్‌వే వంతెనకు వెంటనే మరమ్మతులు చేయాలని రాజప్ప ప్రభుత్వాన్ని కోరారు.
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఏ.కొత్తపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ప్రమాదం నుంచి మహిళా రైతు ఒకరు తృటిలో తప్పించుకున్నారు.ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, కొత్తపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చీరాలలో రహదారులు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కర్నూలు జిల్లా గూడూరులో భారీ వర్షం కురిసింది. పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కర్నూలులో వర్షాలకు రహదారులపై నీరు నిలిచి.. వాహనదారులు ఇబ్బందిపడ్డారు. గుత్తి పెట్రోలు బంకు సమీపంలో.. నీటిలో మొక్కలు నాటి.. భాజపా నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారులకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: భాజపా 'చలో అమలాపురం' యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం