అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో జనజీవనం స్తభించింది. భారీగా వర్షపాతం నమోదు కావడంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో అంతర్గత రహదారులు లేకపోవడంతో రోడ్లన్నీ బురదకయ్యలుగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.
తమ్మిలేరుకు వరద ఉద్ధృతి..
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లా మధ్య ఉండే.. తమ్మిలేరు జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో కురస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా జలాశయానికి వచ్చి చేరుతోంది. సుమారు 2500 కూసెక్కుల వరద వస్తుండగా రాత్రికి మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద తమ్మిలేరు వరద ఉద్ధృతి పెరిగి.. పశ్చిమగోదావరి జిల్లా శివాపురం చిన్నంపేట నడుమ వంతెన ఆఫ్రొచ్ రహదారికి గండి ప్రమాదం ఉంది. ఇప్పటికే రహదారి సగం కోసుకుపోయి ప్రమాదంగా మారింది. గండి పడితే రెండు జిల్లాల నడుమ రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. అధికారులు వెంటనే జోక్యం.. చేసుకుని గండి పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మున్నేరుకు వరద..
భారీ వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తుతోంది. వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద పది అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. అక్కడి నుంచి దిగువకు 17వేల క్యూసెక్కుల వరద పారుతోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జగ్గయ్యపేట ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు విరిగి పడ్డాయి. మంగళవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ 9 సెం.మీ. వర్షం నమోదు కాగా ఇంకా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. వీరులపాడు మండలంలో పంట పొలాలలు నీట మునిగాయి.
నీట మునిగిన పంటలు..
పెనుగంచిపోలు, లింగగూడెం గ్రామాల మధ్య ఉన్న ఇసుక వాగుకు వరద పోటెత్తడంతో మండల కేంద్రంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదకు పెనుగంచిప్రోలు చెరువులో నీటి మట్టం పెరిగింది. ముందస్తు జాగ్రత్తగా తూముల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. గుమ్మడిదురు గ్రామంలో నాట్లు వేసిన వెయ్యి ఎకరాలు వరి పొలం నీటమునిగింది.
ఇదీ చదవండి: