HC On Vijayawada Court Building: విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయ నిర్మాణం పనులను పోలీసులు జరగనివ్వడం లేదని గుత్తేదారు హైకోర్టుకు నివేదించారు. గవర్నర్ బంగ్లా పక్కనే ఉండటంతో అసౌకర్యాన్ని కారణంగా చూపుతూ ప్రహరీ గోడ సమీపంలో పనులు చేపట్టవద్దని పోలీసులు తెలిపారని... గుత్తేదారు తరపున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావించారు. మే నెలాఖరుకు కోర్టు భవనాన్ని అప్పగిస్తామని ఇప్పటికే తాము హైకోర్టుకు హామీ ఇచ్చామని గుర్తుచేశారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని పనులను అడ్డుకోకుండా పోలీసు కమిషనర్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిన్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాననం ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది.
విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని సవాలు చేస్తూ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా గుత్తేదారు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... మే నెలాఖరుకు పనులు పూర్తి చేసి భవనాన్ని అప్పగిస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: వృద్ధులకు ఛార్జీల్లో రాయితీ ఎందుకు పునరుద్ధరించలేదు..?: హైకోర్టు