HC on Varla Ramaiah Petition: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, తెలుగు యువత నేత దండమూడి నాగలక్ష్మణ చౌదరిపై కృష్ణా జిల్లా పామర్రు ఠాణాలో నమోదు చేసిన కేసులో సీఆర్సీపీ సెక్షన్ 41 ఏ నిబంధనలు పాటించాలని దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆదేశించింది. ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలంది. అరెస్ట్ తో పాటు ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈమేరకు ఆదేశాలిచ్చారు.
గుడివాడ క్యాసినో నిర్వహణ విషయంలో నిజనిర్ధారణకు వెళ్లిన సందర్భంగా తెదేపా నేతలు వర్ల రామయ్య, దండమూడి నాగలక్ష్మణ చౌదరిపై ఐపీసీ సెక్షన్ 120బీ (నేరపూర్వక కుట్ర), అధికారిక విధులకు ఆటంకం (సెక్షన్ 353), తదితర సెక్షన్ల కింద పామర్రు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టేయాలని వారిరువురూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి తరపున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు శిక్ష విధింపునకు వీలున్నవేకాబట్టి అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సీఅర్సీసీ సెక్షన్ 41 ఏ నోటీసు విధానాన్ని అనుసరించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారు.
ఇదీ చదవండి: ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించండి: హైకోర్టు