రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ కష్టార్జీతాల కోసం ఎంతో ఆబగా ఎదురు చూస్తున్నారు. వేతనాలు శనివారమే ఖాతాలో జమవుతాయని భావించినా.. రాకపోయే సరికి ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర నిరాశకు లోనయ్యారు. సుమారు 5 లక్షల మందికిపైగా ఉద్యోగులు, లక్షల మంది ప్రభుత్వ పింఛనుదారులు ఉన్నారు.
బ్యాంకులకు సెలవులు..
ఏప్రిల్ ఒకటిన ఆర్థిక సంవత్సరం తొలిరోజు కావడం, ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే కారణంగా.. రెండు రోజులు బ్యాంకులు పనిచేయలేదు. శనివారం చెల్లింపులు జరుగుతాయని భావించినా.. ఖజానాలో చాలినంత సామ్ము అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్థికశాఖ నుంచి సంబంధిత బిల్లులు.. రిజర్వుబ్యాంకుకు చేరలేదని సమాచారం.
ప్రతి నెలా 25 కల్లా..
ఉద్యోగుల జీతాల బిల్లులను.. ప్రతినెలా 25 కల్లా ఖజానా కార్యాలయాలకు పంపిస్తారు. అక్కడ వాటిని పరిశీలించి సీ.ఎఫ్.ఎం.ఎస్‌కు సమర్పి స్తారు. అనంతరం ఆర్థికశాఖ అధికారులకు బిల్లులను చేరవేస్తారు. నిధుల లభ్యతనుబట్టి ఆర్థికశాఖ అధికారులు చెల్లింపులు చేపడతారు.
ఆయా ఖాతాల్లో నో ఎంట్రీ..
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదం పొందినప్పటికీ వరస సెలవుల వల్ల జీతాలు, పించన్‌కు సంబంధించి.. ఆయా ఖాతాల్లో ఎంట్రీలు నమోదు కాలేదని తెలుస్తోంది. జీతాలు, పింఛన్ చెల్లింపులకు ఎంత లేదన్నా రూ. 5 వేల కోట్లు కావాలి. మరో రెండు రోజులు.. వరుస సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 6న అయినా జీతాలు వస్తాయా అనే చర్చ సాగుతోంది.
ఇవీ చూడండి : అందరం కలిసి అక్క రత్నప్రభను గెలిపించుకుందాం : పవన్ కల్యాణ్