1987 బ్యాచ్ ఝార్ఖండ్ కేడర్‌కు చెందిన విష్ణువర్ధనరావు... గతంలో వివిధ రాష్ట్రాల్లో పలుహోదాల్లో సేవలందించారు. ఝార్ఖండ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 18 నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామం విష్ణువర్ధనరావు స్వస్థలం. ఆముదార్లంక ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన... వరంగల్ ఆర్ఈసీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
కూతురు, కొడుకు, అల్లుడూ ఐపీఎస్‌లే..
విష్ణువర్థన్‌రావు కుమార్తె దీపిక, కూమారుడు హర్షవర్థన్, అల్లుడు విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అధికారులే. దీపిక ఆంధ్రప్రదేశ్ దిశచట్టం అమలు ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. అల్లుడు విక్రాంత్ పాటిల్ విజయవాడ డీసీపీగా, కుమారుడు హర్షవర్థన్ అరుణాచల్‌ప్రదేశ్‌లో ఏసీబీ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి నలుగురు ఐపీఎస్‌లు ఉండటం విశేషం.
గ్రామంలో సామాజిక కార్యక్రమాలు...
విష్ణువర్ధనరావు సామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత పదవి చేపట్టడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరు రుణం తీర్చుకునేందుకు ఆముదార్లంకలో వారు అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఝార్ఖండ్ రాష్ట్ర డీజీపీగా పదోన్నతి పొందిన విష్ణువర్ధనరావుకు ఆముదార్లంక గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందనలు తెలుపుతున్నారు.
ఇదీ చదవండి : ఝార్ఖండ్ కొత్త డీజీపీగా ఏపీకి చెందిన వ్యక్తి