Durga Temple: విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన రూ. 70 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన సమీక్షించారు. శివాలయం శిఖర పునర్నిర్మాణం, ప్రాకార నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను పరిశీలించిన ఆయన.. పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. నాణ్యత లోపించకుండా డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలని. నూతన సంవత్సర కానుకగా భక్తులకు శివాలయ దర్శనం కలిగేలా చూడాలని అధికారులకు సూచించారు.
కమిషనర్‌తోపాటు ఆలయ ఈవో భ్రమరాంబ, ఎస్‌ఈ శ్రీనివాస్, స్తపతి, ఏడీసీ చంద్ర కుమార్.. వివిధ అంశాలపై చర్చించారు. ప్రసాదం పోటు నూతన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కమిషనర్.. ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. దేవాలయంలో స్థలాభావం వల్ల ఉన్న స్థలాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. నిర్దేశించిన కాలవ్యవధిలోగా పనులు పూర్తిచేయకపోతే గుత్తేదారులపై చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
అన్నదానం భవన నిర్మాణం పనుల పురోగతి, బడ్జెట్ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. రాక్ మిటిగేషన్ పనులు పరిశీలించిన కమిషనర్.. కొండ చరియలు విరిగి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పూజా మంటపం నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. కేశఖండనశాల నిర్మాణం, తితిదే కళ్యాణ మండపం నిర్మాణాలకు సంబంధించిన అడ్డంకులు తొలగించేందుకు నీటిపారుదల శాఖ, తితిదే ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు.
ఇదీ చదవండి: గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తిచేయాలి: సీఎం జగన్