కృష్ణా జిల్లా వాసులు ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న క్షిపణి పరీక్ష కేంద్రానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండో దశ అనుమతులు మంజూరు చేయడంతో ఈ ప్రాంత వాసుల కల నెరవేరబోతోంది. ఇంతటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. జిల్లాలోని నాగాయలంక సమీపంలోని గుల్లలమోద ప్రాంతంలో ఇది రాబోతోంది. రూ. 1,200 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
పర్యావరణానికి ఇబ్బంది లేకుండా...
డీఆర్‌డీవోకు రెండో దశ అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక షరతులు విధించింది. అటవీ ప్రాంతం కావడంతో ఎక్కడా జీవావరణం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అనుమతి పత్రంలో పేర్కొంది. ప్రయోగాల సమయంలో, ఇతర సమయాల్లోనూ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడి అటవీ ప్రాంతంలో అనేక జంతుజాలం మనుగడ సాగిస్తోంది. వన్యప్రాణి చట్టంలోని షెడ్యూల్ ఒకటిలో బావురు పిల్లి, ఆలివ్ రిడ్లీ తాబేలును చేర్చారు. దీంతో మడ అడవుల్లోని జీవావరణం, అంతరించిపోతున్న జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లకుండా నిర్మాణాలు చేపట్టాలి. సంబంధిత డివిజనల్ అటవీశాఖ అధికారి కూడా ఏటా తనిఖీ చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కేెంద్రం స్పష్టం చేసింది.
అభివృద్ధి కానున్న దివిసీమ...
నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని పరీక్షా కేంద్రానికి అనువైనదిగా గుర్తించారు. ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఈ ప్రాంతం.. ఇక ప్రగతి పథంలో నడవనుంది. నిర్మాణాలు ప్రారంభమైతే.. స్థానికులకూ పెద్ద ఎత్తున పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. సుమారు 300 మంది శాస్త్రవేత్తలు, సిబ్బంది నివాసం ఉండనున్నారు. దీని వల్ల ఈ ప్రాంతం ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. 386 ఎకరాలలో అవసరమైనంత మేరకే స్థలాన్ని వినియోగించుకోనున్నారు. మిగిలిన పరిసర ప్రాంతాల్లో పచ్చదనానికి పెద్దపీట వేయనున్నారు.
ప్రధాన మైలురాళ్లు ఇవీ..
- 2011 - బాలాసోర్ కంటే మెరుగైన సదుపాయాలతో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం.
- 2012 - అనేక ప్రాంతాలను పరిశీలించిన మీదట గుల్లలమోద అనుకూలమైనదిగా తేల్చారు. ఇందుకు 386 ఎకరాలను గుర్తించారు.
- 2017 - రక్షణ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. రెవెన్యూ ఆధీనంలోని 321 ఎకరాలకు, అభయారణ్యంలోని భూములకు కలిపి మొత్తం రూ.35 కోట్లు చెల్లించారు.
- 2017 - తొలి దశ అనుమతి లభించింది.
- 2018 - ఈ ప్రాంతాన్ని సీఆర్‌జడ్ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రచురించింది.
- 2019 - రెండో దశకు అనుమతుల మంజూరు.