వారం రోజులు జరిగిన ముస్కాన్ కొవిడ్-19 నేటితో ముగిసిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. వివిధ జిల్లాల్లో రెస్క్యూ చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులతో డీజీపీ మాట్లాడారు. సమన్వయంతో లక్ష్యాన్ని ఛేదించిన ముస్కాన్ బృందాలను అభినందించారు.4,806 మందిని రెస్క్యూ చేశామన్న డీజీపీ.. 278 మంది బాలకార్మికులను రక్షించామని తెలిపారు.
పట్టుబడిన వారిలో 73 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించామన్నారు. చిరునామా ఉన్న 4,703 మంది వీధి బాలలను తల్లిదండ్రులకు అప్పగించామని తెెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడులకు పంపాలని పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఏ ఆధారం లేని 103 మందిని సంరక్షణా కేంద్రాలకు తరలించామన్నారు. వీధి బాలలతో పనులు చేయిస్తున్న 22 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. వారం రోజుల్లో 1121 మంది పిల్లలకు కరోనా పరీక్షలు చేయించామని అన్నారు. తల్లిదండ్రులకు అప్పగించిన పిల్లలకు పోలీసులు కొవిడ్ కిట్లు ఇచ్చి పంపించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: మరోసారి వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ