కృష్ణా జిల్లా మైలవరంలో కొవిడ్ వ్యాప్తిని నిరోధించేందుకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విధించిన కర్ఫ్యూ వేళలలో నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని సి.ఐ శ్రీను హెచ్చరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రతి ఒక్కరు విధిగా వ్యాపార లావాదేవీలు ముగించుకొని అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కర్ఫ్యూ సందర్భంగా.. పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కింద పడటంతో అతనికి దగ్గర ఉండి ప్రధమ చికిత్స చేయించి జాగ్రత్తగా పంపించారు. వ్యాపారులు, ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు పాటించి పోలీసులకి సహకరించాలని ఎస్. ఐ రాంబాబు కోరారు.
రాష్ట్ర సరిహద్దులోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. రాష్ట్ర పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
మోపిదేవి మండలంలో రేపటి నుంచి 3 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ అమలు కానుంది. మోపిదేవి సెంటర్ లో కొనుగోలు చేయకుండా మిగిలిపోయిన కురగాయలు పాడయిపోతాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కనీసం రెండు గంటలు అయినా కురగాయలు అమ్ముకోటానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. 12 గంటల నుంచి రేపు ఉదయంవరకు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలుచేస్తున్నారు.
రాష్ట్రంలో రెండోదశ కర్ఫ్యూ ఏర్పాటును గన్నవరం నియోజకవర్గ ప్రజలు, వ్యాపారులు స్వాగతించారు. విజయవాడ రూరల్, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో ప్రశాంతంగా కర్ఫ్యూ అమలుఅవుతోంది. స్వచ్ఛందంగా దుకాణాలు, హోటళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే వ్యాపార సముదాయాల మూసివేశారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ ను తరిమికొట్టాలని ప్రజలకు సూచిస్తూ ఫ్లెక్సీలను పెట్టారు. స్థానికంగా పిన్నమనేని కొవిడ్ ఆసుపత్రి, గూడవల్లి క్వారంటైన్ ఉండటంతో అంబులెన్స్ శబ్దాలు మార్మోగుతున్నాయి. మందుల దుకాణాలను మాత్రమే అనుమతించగా.. జాతీయ రహదారిపై అంబులెన్స్ సైరన్ మినహా పెద్దగా వాహనాలు కానరావడంలేదు. ఇప్పటికే హనుమాన్ జంక్షన్, గన్నవరం, ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉంది.
నందిగామ పట్టణంలోని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అత్యవసర సేవలు మినహా కర్ఫ్యూ ప్రశాంతంగా సాగుతోంది. 12 గంటల నుంచి డీయస్పీ నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సిఐ కనకారావు యస్ఐ తాతాచార్యులు, హరిప్రసాద్ షాపులను దగ్గరుండి మూయిస్తున్నారు. పోలీసు అధికారులు పట్టణమంతా పురవీధులలో తిరుగుతూ కరోనాపై అవగాహన చేస్తున్నారు. వ్యాపారస్తులు కూడా కరోనా మహమ్మారిపై భయంతో స్వచ్ఛందంగా షాపులు మూసేయటానికి సిద్ధమయ్యారు.
విజయవాడ నగర శివారు అజిత్‌సింగ్‌నగర్, నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటిరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కర్ఫ్యూ పాక్షికంగా కొనసాగింది. నున్న, సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైపుల రోడ్డు ప్రధాన కూడలిలో పోలీసులు మొదటిరోజు కావడంతో పని లేకుండా రోడ్ల పైకి వచ్చే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మరోసారి వస్తే కేసు నమోదు చేస్తామని తెలియజేశారు. ఏసీపీ షేక్ షా.. పోలీసులు ఏర్పాటు చేసిన వివిధ చెక్ పోస్టులను సందర్శించారు.
ఇదీ చదవండి:
కర్ఫ్యూ ప్రారంభం : రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఆంక్షలు