Crops are Drying up Due to Lack of Irrigation Water: అతివృష్టి ఏర్పడినా.. అనావృష్టి ఏర్పడినా దివిసీమలో రైతులే ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. కృష్ణా జిల్లాలో చివరి ఎకరం వరకు సాగు నీరు ఇస్తామన్న ప్రభుత్వ మాటలు నీటి ముటలుగా మిగులుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంక, కోడూరు ప్రధాన పంట కాలువ చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు ఎక్కువగా కురిసినా.. ఎక్కువ మొత్తంలో వరద వచ్చినా తమ పంట పొలాలు మునిగిపోతాయని రైతులు వాపోతున్నారు. అలాగే సాగు నీరు రాకపోయినా తామే అవస్థలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరువుకాటుకు కళ్లెదుటే ఎండిపోతున్న పంటను దున్నేసిన రైతు - పెట్టుబడి, రెక్కల కష్టం మట్టిపాలు
అధికారులు సాగునీరు విడుదల చేస్తున్నా తమ వరకు రావడం లేదని నాగాయలంక మండలం గుల్లలమొద గ్రామ రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని చెబుతున్నారు. ఎకరాకు ఇప్పటి వరకు 25 వేలు ఖర్చు చేశామని, సకాలంలో నీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరుతున్నారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రం అయిన అవనిగడ్డ దిగువ మండలాలైన నాగాయలంక, కోడూరు మండలంలోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు అందక రైతులు గత కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. వరి పొట్ట దశలో ఉండటంతో ఎక్కువగా సాగునీరు అవసరం కానుంది.
కరవు తాండవం.. పట్టించుకోని పాలకులు.. వలసలే దిక్కు అంటున్న రైతులు
సాగునీరు ఇస్తామని అధికారులు చెప్పడంతో తాము వరి సాగు చేశామని.. కానీ అధికారులు నీరు ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు దాదాపు 25 వేలు ఖర్చు చేసి సాగునీరులేక వరి పొలాన్ని అలాగే వదిలేస్తున్నామని తెలిపారు. తాము వ్యవసాయాన్ని నమ్ముకునే జీవిస్తున్నామని, ఇక్కడ చేయడానికి ఇతర పనులేవి ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా సాధికారిక యాత్రల పేరుతో హడావిడి చేస్తే ప్రయోజనం ఏముంటుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ ఖర్చుల కోసం వడ్డీలకు అప్పులు తీసుకున్నామని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం కనుక తమను ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు.
ప్రకృతి కరుణించలేదు, పాలకులు కనికరించడం లేదు - కరవు మండలాల ప్రకటనలో వివక్షపై రైతన్న ఆవేదన
వరి నాట్లు వేసే సమయంలో రైతు భరోసా కేంద్రం అధికారులు పంట నమోదు చేసుకోమని చెప్తే చేశామని.. ఇప్పుడు నష్టపరిహారం అడుగుతుంటే పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమలో చాలా మంది కౌలు రైతులు ఉన్నారని, వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. అందిన కాడికి అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పంట మొత్తం నీరు లేక ఎండిపోయిందని వాపోతున్నారు. వర్షధారంగా ఎన్ని రోజులు వ్యవసాయం చేయగలమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అధికారులు నీళ్లు ఇస్తామని చెప్పి చివరికి తమను మోసం చేశారని రైతులు వాపోతున్నారు. గత సంవత్సరం పంటలు నష్టపోయినా ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదని ఈ సంవత్సరం అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.