కరోనా సెకండ్ వేవ్ ఊహించిన దాని కంటే వేగంగా విజృంభించింది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో రాష్ట్రంపై మహమ్మారి ముప్పేటదాడి చేసింది. వందల నుంచి నిత్యం వేలాది మంది మహమ్మారి భారినపడ్డారు. ఏప్రిల్‌లో ఒకేరోజు పదివేల మందికి పైగా కొవిడ్ సోకింది. ఆస్పత్రుల్లో పడకలు సైతం క్రమంగా నిండుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో బాధితులకు పడకలు దొరకని పరిస్థితి తలెత్తింది. ఇటీవల రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. గత వారం రోజుల్లో పాజిటివ్ రేటు దాదాపు రెండు శాతం వరకు తగ్గటమే ఇందుకు నిదర్శనం. మే 1న రాష్ట్రంలో సుమారు 10శాతానికి పైగా ఉన్న కరోనా పాజిటివ్ రేటు ప్రస్తుతం 8.08శాతానికి తగ్గిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
మెరుగ్గా రికవరీ రేటు..
మే 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 76,330 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా.. 71,678 మందికి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అందులో 4,370 మందికి వైరస్ నిర్ధరణ అయిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంటే 10.36 శాతం మంది వైరస్ బారిన పడ్డారు. రికవరీ రేటు సైతం 81.57 శాతంగా నమోదైంది. మరణాలు 0.52 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ నివేదికలు తెలిపాయి. మే 2న నాటికి పాజిటివ్ రేటులో స్పల్ప పెరుగుదల నమోదైంది. 10.39 శాతం మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది. రికవరీ రేటు సైతం 81.91శాతానికి పెరిగింది. మే 3న 10.24 శాతం పాజిటివ్ రేటు.. 82.3 శాతం రికవరీ రేటు నమోదైందని ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.
మే చివరికి మరింత కట్టడి..
మే 4న పాజిటివ్ రేటు 8.64 శాతం కాగా.. రికవరీ రేటు 82.91కి పెరిగింది. మరణాలు సైతం స్వల్పంగా పెరిగి 0.53 శాతానికి చేరింది. మే 5న 7.95 శాతం పాజిటివ్ రేటు నమోదవ్వగా.. రికవరీ రేటు 83.24కి, మరణాలు 0.54కి పెరిగాయి. మే6న అంటే గత 24 గంటల్లో వెలువడిన ఫలితాల్లోనూ పాజిటివ్ రేటు 8.08 శాతం.. రికవరీ రేటు 84.12శాతానికి పెరగడం గమనార్హం. గడచిన వారం రోజులుగా క్రమంగా కరోనా పాజిటివిటి రేటు తగ్గటంతోపాటు.. రికవర్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఫలితంగా ఈ నెల చివరినాటికి కరోనా కొంత అదుపులోకి రావచ్చని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 5,892 కరోనా కేసులు, 46మరణాలు